అణు పరీక్షలపై గ్రహాంతరవాసుల నిఘా? – కొత్త అధ్యయనంలో సంచలన వివరాలు

భూమిపై గత శతాబ్దం మధ్య కాలంలో జరిగిన అణు పరీక్షల సమయంలో ఆకాశంలో వింత వెలుగులు, తెలియని వస్తువులు దర్శనమిచ్చినట్లు శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది. స్వీడన్‌లోని నోర్డిక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్‌కు చెందిన డాక్టర్ బీట్రిజ్ విల్లరోయెల్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ విశ్లేషణ చేసింది. వారు చేసిన పరిశోధన ప్రకారం, భూమిపై మానవులు ప్రారంభించిన అణు శకం సమయంలో గ్రహాంతరవాసులు (Aliens) నిఘా ఉంచి ఉండవచ్చుననే సూచనలున్నాయని నివేదిక పేర్కొంది.

అణు శకం ప్రారంభంలోనే వింత చలనాలు

1949 నుండి 1957 మధ్యకాలంలో అమెరికా, బ్రిటన్‌, సోవియట్ యూనియన్‌లు అనేక అణు పరీక్షలు జరిపాయి. అదే కాలంలో ఆకాశంలో కొన్ని ‘ట్రాన్సియెంట్స్‌’ అనే విచిత్ర ప్రకాశ వంతమైన వస్తువులు దర్శనమిచ్చినట్లు రికార్డులు వెల్లడించాయి. ఇవి నక్షత్రాల్లా ఒక్కసారిగా వెలిగిపోతూ, క్షణాల్లో మాయమైపోయేవని శాస్త్రవేత్తలు వివరించారు.

డాక్టర్ విల్లరోయెల్ నివేదిక ప్రకారం — 1957లో మానవుల మొదటి ఉపగ్రహం స్ఫుత్నిక్ 1 ప్రయోగం జరగడానికి చాలాకాలం ముందే ఈ వింత వస్తువులు కనిపించాయి. విశ్లేషణ ప్రకారం, అణు పరీక్షలు జరిగే రోజుల్లో ఈ వస్తువులు కనిపించే అవకాశం సాధారణ రోజులతో పోలిస్తే 45% ఎక్కువగా ఉందని, ఫోటోలలో వీటి ఉపస్థితి 8.5% పెరిగిందని వెల్లడించారు.

వేలాది చారిత్రక ఫొటోల విశ్లేషణ

ఈ అధ్యయనంలో పరిశోధకులు కాలిఫోర్నియాలోని పలోమార్ అబ్జర్వేటరీ స్కై సర్వేలో సేకరించిన వేలాది చారిత్రక ఫొటోలను పరిశీలించారు. వీటిలో భూమి ఉపరితలంపై జరిగిన 124 అణు పేలుళ్ల ఫొటోలు కూడా ఉన్నాయి. భూగర్భ పరీక్షల కంటే ముందుగా జరిగిన ఈ అణు ప్రయోగాలు వాతావరణంలో రేడియోధార్మికతను, ప్రకంపనలను విపరీతంగా విడుదల చేశాయి.

ఇవి జరిగిన సమయాల్లో కనిపించిన ట్రాన్సియెంట్స్‌ వస్తువులు ఫ్లయింగ్ సాసర్‌ ఆకారంలో, గిరగిరా తిరుగుతూ, అద్దంలా సమతలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిని సహజ ఖగోళ వస్తువులుగా వివరించడానికి తగిన ఆధారాలు ఇప్పటివరకు లేవని డాక్టర్ విల్లరోయెల్ తెలిపారు.

పరిశోధనకు పీర్ రివ్యూ ఆమోదం

ఈ అధ్యయనం పీర్ రివ్యూలో విజయవంతమైంది. ఇతర శాస్త్రవేత్తలు కూడా డేటాను సమీక్షించగా, ఇందులోని వివరాలను తోసిపుచ్చడానికి తగిన సాక్ష్యాలు లేవని తేల్చారు. ఆకాశ పరిశీలనల్లో మొత్తం 1 లక్షకుపైగా ట్రాన్సియెంట్లు గుర్తించబడ్డాయి. వాటిలో దాదాపు 35,000 ఉత్తరార్ధగోళంలో మాత్రమే దర్శనమిచ్చాయని నివేదిక పేర్కొంది.

భూమి వైపు ఎవరి చూపు?

ఈ ఫలితాలు భూమిపై మానవులు మొదటిసారి అణు శక్తిని వినియోగించినప్పుడు ఏదో ఒక మానవేతర నాగరికత మనపై నిఘా ఉంచి ఉండవచ్చునని సూచిస్తున్నాయి. ఇప్పటికీ ఈ ఫోటోల్లో కనిపించిన వింత ప్రకాశవంతమైన వస్తువుల అసలు మూలం, స్వరూపం తెలియదు. అయితే, ఈ పరిశోధన అంతరిక్ష పరిశీలనలలో ఒక కొత్త దిశను చూపించిందని నిపుణులు భావిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి