1964 హోలోమన్ ఎయిర్‌బేస్‌లో గ్రహాంతరవాసుల దర్శనం? డాక్యుమెంటరీ సంచలనం

విశ్వంలో మనుషులే ఏకైక జీవరాశులా? లేక మరెక్కడైనా జీవం ఉండొచ్చా?—ఈ ప్రశ్న శతాబ్దాలుగా శాస్త్రవేత్తల నుంచీ సాధారణ ప్రజల వరకూ అందరినీ రేకెత్తిస్తోంది. భూమిపైనే దేవుడు జీవాన్ని సృష్టించాడని కొంతమంది ధృడంగా నమ్మితే… ఈ విస్తార విశ్వంలో జీవం ఒక్క గ్రహానికే పరిమితం అయి ఉండదని మరో వర్గం వాదిస్తోంది. నమ్మకాలు పరస్పర విరుద్ధమైనా… ఈ చర్చ ఎప్పటికీ ముగియనిదే.

ఈ నేపథ్యంలో అమెరికా న్యూయార్క్ పోస్ట్ విడుదల చేసిన తాజా డాక్యుమెంటరీ “ది ఏజ్ ఆఫ్ డిస్‌క్లోజర్” మళ్లీ గ్రహాంతరవాసుల అంశాన్ని హాట్ టాపిక్‌గా మార్చింది. ఇందులో చెప్పిన కథనం ప్రకారం… 1964లో న్యూ మెక్సికోలోని హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద వైమానిక దళ సిబ్బంది గ్రహాంతరవాసులను ప్రత్యక్షంగా చూసినట్లు పేర్కొంది. ఈ సంఘటనను అప్పటి అమెరికా భద్రతా వ్యవస్థతో అనుసంధానించడం మరింత సంచలనంగా మారింది.

డాక్యుమెంటరీ వివరాల ప్రకారం… యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ (1989–93) 1976–77 మధ్య కాలంలో CIA డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఈ ఘటన గురించి ఎయిర్ ఫోర్స్ అధికారులు ఆయనకు వివరించినట్లు తెలిపారు. ఈ సమాచారాన్ని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ ఎరిక్ డేవిస్ 2003లో జరిగిన ప్రైవేటు సంభాషణలో పొందినట్లు డాక్యుమెంటరీ పేర్కొంటోంది.

శాస్త్ర రంగంలో పేరొందిన ఎరిక్ డేవిస్… 2007లో అమెరికా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన AATIP (Advanced Aerospace Threat Identification Program) కు సలహాదారుడిగా కూడా పనిచేశారు. ఆయన వెల్లడించిన వివరాలు ఆమోదయోగ్యమైన ఆధారాలు లేనప్పటికీ ఆసక్తికరంగానే ఉన్నాయి.

ఎరిక్ డేవిస్ వ్యాఖ్యల ప్రకారం…

  • హోలోమన్ ఎయిర్ ఫోర్స్ బేస్ సమీపంలో మూడు అంతరిక్ష నౌకలు ప్రత్యక్షమైనట్లు సైన్యం అప్పట్లో పేర్కొంది.
  • వాటిలో ఒక స్పేస్‌క్రాఫ్ట్ భూమిపై దిగిందని…
  • అందులోంచి బయటకు వచ్చిన ఓ గ్రహాంతరవాసి ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సంభాషించడానికి ప్రయత్నించాడని ఆయనకు అందిన సమాచారం.
  • అయితే దీనిపై మరిన్ని వివరాలు ఇవ్వలేదని బుష్ తనతో చెప్పినట్లు డేవిస్ పేర్కొన్నారు.

ఇంతలో మరొక కీలక సమాచారాన్ని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ రోగనిరోధక శాస్త్రవేత్త, క్యాన్సర్ పరిశోధకుడు గ్యారీ నోలన్ వెల్లడించారు. గ్రహాంతరవాసులతో సమీపంగా వచ్చిన సిబ్బందిలో కొంతమందికి కాలిన గాయాలు, అంతర్గత మచ్చలు, తెలియని రేడియేషన్ ప్రభావాలు కనిపించినట్లు ఆయన పరిశోధనలో తేలిందని తెలిపారు.

ఈ డాక్యుమెంటరీలో AATIP సభ్యుడు, భౌతిక శాస్త్రవేత్త హాల్ పుథాఫ్ ఇచ్చిన సాక్ష్యాలు కూడా చేర్చడం మరో ఆకర్షణగా మారింది. అమెజాన్ ప్రైమ్‌లో శుక్రవారం ప్రసారం అయిన వెంటనే ఈ కథనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

భౌతిక ఆధారాలు లేని నేపథ్యంలో ఈ వివరాల నిజానిజాలపై సందేహాలు నిలిచివున్నా… “ఈ విశ్వంలో మనమే ఒక్కడమా?” అనే ప్రశ్నకు మరోసారి వేడి చర్చను రగిలించిన విషయం మాత్రం నిజం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి