ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఏకైక ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేశ్ కన్నీటి గాధ

దేశమంతా దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జ్ఞాపకాలు ఇప్పటికీ మరవలేకపోతున్నారు ఆ ఘటనలో ఏకైకంగా ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేశ్‌. 2025 జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే కుప్పకూలిన ఆ విమానంలో 242 మంది ప్రయాణికులలో 241 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్క విశ్వాస్ కుమార్ రమేశ్ మాత్రమే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. నాలుగు నెలల తర్వాత ఆయన యూకేకు చెందిన స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను, ఆత్మగాథను పంచుకున్నారు.

రమేశ్‌ మాట్లాడుతూ – “ఆ రోజును మరచిపోవడం నా వల్ల కాదు. నా సోదరుడు కూడా ఆ విమానంలోనే ఉన్నాడు. అతడే నా బలం, నా వెన్నెముక. అతడు లేడన్న విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా” అని భావోద్వేగానికి గురయ్యాడు. ప్రమాదం తర్వాత ఇప్పటికీ తనకు మోకాళ్లు, భుజం, వెన్ను నొప్పులు తీవ్రంగా ఉన్నాయని, నడవడమూ కష్టంగా మారిందని తెలిపారు.

తన కుటుంబ పరిస్థితి గురించి మాట్లాడుతూ – “నా కుమారుడు నాలుగున్నరేళ్ల వయసులో ఉన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత నేను అతనితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. రోజంతా మంచం మీదే కూర్చుంటున్నా. ఆ దృశ్యాలు ఇప్పటికీ నా కళ్ల ముందు మెదులుతూనే ఉంటాయి. నేను ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నా. భార్యతో, కుమారుడితో మాట్లాడటం కూడా తగ్గిపోయింది. నేను ఎవరినీ చూడాలనిపించట్లేదు” అని తెలిపారు.

విశ్వాస్‌ చెప్పిన మాటల్లో నిండుగా వేదన, ఆవేదన కనిపించాయి. “నా పరిస్థితిని చూసి నా కుటుంబం కూడా బాధపడుతోంది. అమ్మ నాతో మాట్లాడడం మానేసింది. నేను రాత్రిళ్లు నిద్రపట్టక ఆలోచనల్లో మునిగిపోతున్నా. ఇది మాకు అందరికీ ప్రతిరోజూ ఒక మానసిక యాతనే అయిపోయింది” అని ఆయన కన్నీటి గళంతో చెప్పారు.

విశ్వాస్‌ ప్రస్తుతం *పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (PTSD)*‌తో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. రాత్రిపూట భయంతో నిద్రలేచే పరిస్థితి ఉందని, మానసిక వైద్యుడి దగ్గర కౌన్సెలింగ్‌ తీసుకుంటున్నాడని ఆయన కజిన్‌ వివరించాడు.

ఇక ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియా కంపెనీ రమేశ్‌ కుటుంబానికి రూ.22 లక్షల పరిహారం అందించేందుకు అంగీకరించిందని, ఆ మొత్తాన్ని ఆయన స్వీకరించినట్లు సమాచారం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి