ఈ భూమిపై అప్పులు లేని వారు చాలా అరుదు. ఆర్థికంగా బలమైన అంబానీ, అదానీ లాంటి కుబేరులకు కూడా అప్పులు ఉన్నాయంటే సామాన్యుడి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది జీతాలు బాగానే సంపాదిస్తున్నా, నెలాఖరుకి చేతిలో దాచేది ఏమీ ఉండదు. అప్పులు తగ్గడం లేదు, పైగా క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఒక వ్యక్తి. మంచి కంపెనీలో ఐదు అంకెల జీతం పొందుతున్నా అప్పుల భారంతో సతమతమవుతున్నాడు. ఎవరిని అడిగినా సరైన పరిష్కారం దొరకలేదు. ఒక రోజు సరదాగా — “అంతా ఏఐ ఏఐ అంటున్నారు… నా అప్పు సమస్యను దీని దగ్గర అడిగితే ఏమవుతుందో చూద్దాం” — అని చాట్‌జీపీటీని ఆశ్రయించాడు.
తన సమస్య వివరించగా, చాట్‌జీపీటీ అతని జీతం, నెలవారీ ఖర్చులు, ఈఎంఐలు, అద్దె, ఇతర ఖర్చుల వివరాలు అడిగింది. ఒక్క రూపాయి కూడా వదలకుండా అన్నీ తెలిపాడు. ఆ వివరాలన్నింటిని విశ్లేషించిన చాట్‌జీపీటీ అతనికి షాకిచ్చే నిజాలు చూపించింది — వృథా ఖర్చులు ఎక్కడ జరుగుతున్నాయి, ఎలాంటి ఖర్చులు తగ్గించుకోవాలి, ఎలా సేవ్ చేయాలి అన్న వివరాలను పూర్తి ప్రణాళిక రూపంలో వివరించింది.
అది మాత్రమే కాదు — తన నెలవారీ ఆదాయంలో నుంచి ఎంత మొత్తాన్ని సేవింగ్‌గా పెట్టుకోవాలి, ఆ మొత్తాన్ని ఎలా పెట్టుబడి చేయాలి, అలా చేస్తే రెండేళ్లలో తన ₹10 లక్షల అప్పులు పూర్తిగా తీర్చగలడని కూడా లెక్కలు చూపించింది. చాట్‌జీపీటీ సూచనల ప్రకారం క్రమశిక్షణతో ఆర్థిక నిర్వహణ చేపట్టిన అతను కేవలం రెండు సంవత్సరాల్లోనే అన్ని అప్పులు తీర్చేశాడు.
ఇప్పుడు అతను ఆర్థికంగా స్వేచ్ఛగా, ఒత్తిడి లేకుండా జీవిస్తున్నాడు. “నా జీవితాన్ని మార్చింది ఏఐ – అది చూపించిన దారే నా విజయానికి కారణం” అంటున్నాడు.
నిజానికి ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. మీరు కూడా అప్పులతో ఇబ్బంది పడుతుంటే, మీ ఖర్చులను, ఆదాయాన్ని విశ్లేషించడంలో ఏఐ టూల్స్ ఉపయోగించండి. చాట్‌జీపీటీ వంటి టెక్నాలజీలు సరైన మార్గం చూపించగలవు. ఆర్థిక అవగాహన పెంపొందించడంలో ఇవి మీకు నిస్సందేహంగా సహాయపడతాయి.



