ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కోతుల బెడదకు దేవయ్య వినూత్న పరిష్కారం

గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే కనిపించే ఓ విభిన్న దృశ్యం ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి, ఆయన ముందు ఠీవిగా కూర్చున్న ఓ కొండముచ్చు. ఇది ఏదో వినోదం కోసం కాదు, గత 23 ఏళ్లుగా వర్సిటీని వదిలిపెట్టని కోతుల బెడదకు ఉద్యోగి దేవయ్య కనుగొన్న అద్భుత పరిష్కారం.

2002లో వందలాది కోతులు వర్సిటీ క్యాంపస్‌ను ముట్టడించాయి. తరగతి గదులు, విద్యార్థుల హాస్టళ్లు, భోజనశాలలు… ఎక్కడైనా చొరబడి భయాందోళనలు సృష్టించేవి. విద్యార్థులు క్యాంపస్‌లో స్వేచ్ఛగా తిరగాలంటే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్య తీవ్రత పెరగడంతో యాజమాన్యం పరిష్కారం కోసం మార్గాలు వెతికింది. చివరికి ఈ బాధ్యతను అప్పటికి వర్సిటీ సిబ్బందిగా ఉన్న దేవయ్యకు అప్పగించింది.

దేవయ్య ఆలోచన విభిన్నం. కోతులను తరిమేందుకు ఆయుధాలు కాదు, సహజ శత్రువైన కొండముచ్చునే ఎంచుకున్నారు. సైకిల్ ముందు కొండముచ్చును కూర్చోబెట్టి, క్యాంపస్ మొత్తం తిరగడం ఆయన ప్రత్యేక వ్యూహం. కొండముచ్చు దరిచేరగానే కోతులు భయంతో చెదరిపోవడం మొదలుపెట్టాయి. అప్పటి నుంచి ఇది దేవయ్య రోజువారీ కర్తవ్యంగా మారింది. ఉదయం, మధ్యాహ్నం ఆయన సైకిల్‌పై గస్తీ కాస్తూ, కోతులు క్యాంపస్‌లోకి రాకుండా కాపలా కాస్తున్నారు.

ఇంతకాలం ఆయనకు రెండు కొండముచ్చులు తోడుగా నిలిచి, తరువాత సహజ కారణాలతో మరణించాయి. అయినా దేవయ్య తన విధిని ఆపలేదు. ప్రస్తుతం మూడో కొండముచ్చుతో ఈ సేవ కొనసాగిస్తూ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కోతుల బెడద నుంచి రక్షణ కల్పిస్తున్నారు.

ఒక సమస్యకు అంకితభావంతో, పట్టుదలతో పరిష్కారం వెతికితే ఎలాంటి మార్గం దొరుకుతుందో దేవయ్య జీవితం నిలువెత్తు సాక్ష్యం. వర్సిటీ క్యాంపస్‌లో ఆయన సైకిల్ ప్రయాణం కేవలం రక్షణ మాత్రమే కాదు, సమర్పణకు ప్రతీకగా మారింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి