ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న యూట్యూబర్ Anvesh (నా అన్వేషణ) ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మతపరమైన అంశాలపై చేసిన కొన్ని వీడియోలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపణలు రావడంతో హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కాగా, ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ క్రమంలో ప్రముఖ నటి Karate Kalyani ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత వేడెక్కింది. అన్వేష్ వీడియోలు మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన అనంతరం మెటా సంస్థ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఆయన ఖాతా, వివాదాల అనంతరం 1.3 మిలియన్లకు పడిపోయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఖాతా యాక్సెస్ చేయలేని పరిస్థితి ఉంది.
ఆన్‌లైన్ బెట్టింగ్ అంశాలను బయటపెట్టి ఒకప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన అన్వేష్, కొద్ది నెలల్లోనే వివాదాలతో వార్తల్లో నిలిచారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనేక మంది ఫాలోవర్లు ఆయన ఖాతాలను అన్‌ఫాలో చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఇటీవలే తన ప్రపంచ యాత్రను నిలిపివేస్తున్నట్లు అన్వేష్ వీడియో ద్వారా ప్రకటించారు. యూట్యూబ్ ద్వారా సంపాదించిన ఆదాయం సరిపోతుందని, ఇకపై ప్రజా సమస్యలపై స్పందించాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై బ్యాన్ నేపథ్యంలో అన్వేష్ అధికారికంగా ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.



