అన్నదాతల శ్రేయస్సే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అసెంబ్లీలో వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 22,30,703 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అమల్లో ఉన్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు డిస్కంల పరిధిలో 1,02,538 కొత్త ఉచిత వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అయితే ఇంకా 46 వేల కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయని, వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి వాటిని కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.839.44 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పీఎం కుసుమ్ పథకం కింద ఇప్పటివరకు 2,61,481 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఫీడర్ లెవల్ సోలార్ ప్రాజెక్టుల ద్వారా 1035 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం టెండర్లు పిలిచామని, మే నుంచి పనులు ప్రారంభమవుతాయని మంత్రి పేర్కొన్నారు. 2028–30 నాటికి 4000 మెగావాట్ల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సోలార్ ప్రాజెక్టులు పూర్తయితే రైతులకు ఉదయం వేళల్లో 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించగలమని మంత్రి స్పష్టం చేశారు.



