అధిక రక్తపోటు (బీపీ) ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యగా మారుతోంది. దీని వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల ప్రమాదం పెరుగుతోంది. బీపీ ఉన్నవారికి సాధారణంగా నిరంతర వైద్య చికిత్స అవసరం ఉంటుంది. వైద్యుల సూచనల ప్రకారం మందులు క్రమం తప్పకుండా వాడాలి. అయితే మందులతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకుంటే బీపీని మెరుగ్గా నియంత్రించుకోవచ్చు. తాజాగా, రోజూ మాత్రలు వాడాల్సిన అవసరం లేకుండా ఏడాదికి రెండు ఇంజెక్షన్లతోనే బీపీ నియంత్రించే అవకాశం అందుబాటులోకి వస్తోంది.
అధిక రక్తపోటు ఉన్నవారు తరచూ బీపీ పరీక్షించుకోవాలి. బీపీ స్థాయిలను బట్టి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. అదే సమయంలో జీవనశైలిలో మార్పులు చేయడం కూడా చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి బీపీ నియంత్రణకు దోహదపడతాయి.
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి. ఉప్పు వినియోగాన్ని తగ్గించడం చాలా అవసరం. అధిక సోడియం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ధ్యానం, యోగా, లోతైన శ్వాస వ్యాయామాలు వంటి పద్ధతులతో ఒత్తిడిని తగ్గించుకోవాలి. వైద్యులు సూచించిన విధంగా మందులు క్రమం తప్పకుండా వాడటం కూడా తప్పనిసరి.
ఏడాదికి రెండు ఇంజెక్షన్లతో బీపీ నియంత్రణ
ప్రముఖ మెడికల్ జర్నల్ The Lancetలో వెలువడిన తాజా అధ్యయనాల ప్రకారం, రానున్న రోజుల్లో రోజూ మాత్రలు వాడాల్సిన అవసరం లేకుండా ఏడాదికి రెండు ఇంజెక్షన్లు తీసుకుంటే సరిపోతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ఇంజెక్షన్ రక్తపోటును దీర్ఘకాలం సమర్థంగా నియంత్రించగలదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఈ పరిశోధనలో భాగంగా Roche మరియు Alnylam Pharmaceuticals సంస్థలు కలిసి ఆర్ఎన్ఏ సాంకేతికతతో Zilebesiran అనే ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేశాయి. ఇది ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే యాంజియోటెన్సినోజెన్ అనే ప్రొటీన్‌ను అడ్డుకోవడం ద్వారా బీపీ పెరగకుండా నియంత్రిస్తుంది. ఒకసారి ఇంజెక్షన్ వేస్తే దాదాపు ఆరు నెలల పాటు ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. దీంతో భవిష్యత్తులో ఏడాదికి రెండు ఇంజెక్షన్లతోనే రక్తపోటును నియంత్రించే సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.



