ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజే రాజకీయ వేడి రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లకార్డులు చేతబట్టి అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకు దిగారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సభకు చేరుకున్న జగన్, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు.
గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఎన్నికల హామీలను తక్షణం అమలు చేయాలని కోరారు. “లడ్డూ అంశంపై అసత్య ప్రచారం జరుగుతోంది” అంటూ స్లోగన్లు ఇచ్చారు.
పోడియం చుట్టూ వైసీపీ సభ్యులు గుమికూడటంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్షల్స్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం జగన్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇదే విధంగా కొనసాగితే సహించేది లేదు” అంటూ హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు సభకు హాజరవ్వవచ్చని సూచించినప్పటికీ, మండలిలో మాత్రం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పార్టీ నేతల ఇళ్లపై దాడులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
గవర్నర్ ప్రసంగం అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, అజెండా ఏవిధంగా ఉండాలి అన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశానికి వైసీపీ దూరంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం దాదాపు 20 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉందని సమాచారం.
లడ్డూ వివాదం, మెడికల్ కాలేజీల అంశాలపై సభలో సమగ్ర చర్చ జరిపి ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశాలు సుదీర్ఘంగా సాగనున్న నేపథ్యంలో జగన్ తీసుకునే తదుపరి వ్యూహంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.



