AP Fee Reimbursement: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.1200 కోట్ల బకాయిల విడుదల

ఏపీలోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన పెండింగ్ బకాయిలను ఒకేసారి విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.1200 కోట్ల నిధులను మంగళవారం విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గత కొన్నేళ్లుగా ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని కాలేజీలు హాల్ టికెట్లు, సర్టిఫికేట్లు ఇవ్వకపోవడంతో సమస్యలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో కాలేజీలు విద్యార్థులకు ఇబ్బందులు పెట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండగా, వాటిలో భాగంగా రూ.1200 కోట్లను విడుదల చేశారు. జ్ఞానభూమి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఈ నిధులు అందనున్నాయి.

ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ తదితర పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రూ.20 వేల వరకు ట్యూషన్, హాస్టల్ ఖర్చుల కోసం తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనున్నారు. నిధులు విడుదల కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊరట వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి