ఒకప్పుడు ఉద్యోగావకాశాలు అంటే హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాలే ప్రధానంగా గుర్తుకొచ్చేవి. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు వేగంగా మారుతోంది. బ్లూ కాలర్, గ్రే కాలర్ ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు చిన్న నగరాలు (Tier-3, Tier-4 cities) కొత్త అవకాశాల కేంద్రాలుగా మారుతున్నాయి. కొత్త కార్మిక చట్టాల అమలు, పరిశ్రమల విస్తరణతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో నియామకాలు గణనీయంగా పెరిగాయని ‘వర్క్‌ఇండియా’ తాజా నివేదిక వెల్లడించింది.
మెట్రో నగరాలతో పోలిస్తే చిన్న పట్టణాల్లోనే ఉద్యోగాల కల్పన వేగంగా జరుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. కొన్ని నగరాల్లో నియామకాలు ఏకంగా 56 శాతం వరకు పెరగడం గమనార్హం. నగరాల వారీగా నియామకాల వృద్ధి ఇలా ఉంది.
● కొల్హాపుర్ – 56.3%
● ఉదయపుర్ – 55.3%
● గోవా – 23.6%
● విజయవాడ – 20.2%
● కోచి – 17.7%
● కోయంబత్తూరు – 14.1%
కొత్త కార్మిక చట్టాలపై భయాలు పటాపంచలు
కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే నియామకాలు తగ్గుతాయనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వర్క్‌ఇండియా నివేదిక స్పష్టం చేసింది. చట్టాల అమలు తర్వాత మొత్తం నియామకాలు 8.4 శాతం పెరిగాయి. ఈ అధ్యయనం కోసం వర్క్‌ఇండియా సంస్థ అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు ఉన్న డేటాను విశ్లేషించింది.
మెట్రో నగరాల్లో కూడా నియామకాల్లో స్థిరమైన వృద్ధి కనిపిస్తోంది. అహ్మదాబాద్‌లో 19.2 శాతం, పుణెలో 13.2 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం.
నివేదికలోని మరికొన్ని కీలక అంశాలు
◆ మహిళా నియామకాలు:
పురుషుల ఉద్యోగాల వృద్ధి 6.3 శాతంగా ఉండగా, మహిళల నియామకాలు 10 శాతం పెరిగాయి. ఉద్యోగ రంగంలో మహిళల భాగస్వామ్యం మరింత బలపడుతున్నట్లు ఇది సూచిస్తోంది.
◆ వర్క్ ఫ్రమ్ హోమ్ తగ్గుదల:
ఇంటి నుంచి పని చేసే (WFM) ఉద్యోగాలు 10.4 శాతం తగ్గగా, కార్యాలయం నుంచి పని చేసే (Work from Office) నియామకాలు 8.7 శాతం పెరిగాయి.
◆ మెట్రో నగరాల్లో స్థిరమైన డిమాండ్:
చిన్న పట్టణాల్లో వేగం ఎక్కువగా ఉన్నప్పటికీ, ముంబై (8.8%), కోల్‌కతా (8.9%) వంటి ప్రధాన నగరాల్లో ఉద్యోగ డిమాండ్ నిలకడగా కొనసాగుతోంది.
వ్యాపార సంస్థలు మెట్రో నగరాల నుంచి జిల్లా కేంద్రాలు, చిన్న పట్టణాల వైపు విస్తరిస్తుండటంతో స్థానిక యువతకు తమ సొంత ప్రాంతాల్లోనే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా బ్లూ కాలర్ (నైపుణ్యం కలిగిన కార్మికులు), గ్రే కాలర్ (సర్వీస్ సెక్టార్) రంగాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.



