CM Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరంపై కీలక చర్చలు

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక సాగునీటి అంశాలపై సవివరంగా చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్‌, తాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టులు ఎంతో అవసరమని సీఎం కేంద్రమంత్రికి వివరించారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా ఎత్తివేయాలని సీఎం కోరారు. ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. అలాగే కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు వల్ల పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ఫేజ్–IIకు ఆర్థిక సహాయం అందించాలని, భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టల కోసం సుమారు రూ.32,000 కోట్ల నిధులు అవసరమని పేర్కొన్నారు.

గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించేందుకు పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతులు, సాంకేతిక–ఆర్థిక సహాయం ఇవ్వాలని సీఎం కోరారు. అలాగే జల్ జీవన్ మిషన్‌కు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై కూడా చర్చించిన సీఎం, వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ తుది నివేదికను గెజెట్‌లో వెంటనే ప్రచురించాలని కోరారు.

గోదావరి జలాల పంపకంపై ఏపీ–తెలంగాణ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రిని కోరారు. అలాగే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై కర్ణాటక చర్యలను వ్యతిరేకిస్తూ, వాటి వల్ల ఏపీకి నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి