దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వస్తున్న ఈ మైథలాజికల్ టైమ్ ట్రావెల్ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తే, హాలీవుడ్ టెక్నీషియన్లు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో రాజమౌళి మరో కొత్త ప్రపంచాన్ని వెండితెరపై చూపించబోతున్నాడని అర్థమవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాదు, త్రేతాయుగానికి చెందిన శ్రీరాముడిగా కూడా ఆయన దర్శనమివ్వబోతున్నారనే టాక్ అభిమానుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండగా, ఆయన పాత్ర సినిమాకు కీలకంగా మారనుందట. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్న ఓ భారీ పడవ ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఊపిరి బిగబట్టేలా చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాలో అసలైన సర్ప్రైజ్ ఏమిటంటే… బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పాత్రలు కూడా ఉండనున్నాయట. ఈ దేవతల పాత్రల్లో అగ్రశ్రేణి స్టార్ హీరోలు కనిపించబోతున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. అలాగే కథ మొత్తం తిరిగే ఒక కీలక ‘అఘోరా’ పాత్ర కూడా ఉందని, ఆ క్యారెక్టర్ ఎవరనేది ప్రస్తుతానికి సీక్రెట్‌గా ఉంచారని సమాచారం.
హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రూపొందుతున్న ‘వారణాసి’ని 2027 ఏప్రిల్ 7న పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి విజన్‌కు మహేష్ బాబు నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.



