15 ఏళ్ల బాలికను బలిచేసిన ఐవీఎఫ్/ IVF మాఫియా – ప్రయాగ్‌రాజ్‌లో వెలుగుచూసిన మానవత్వ హత్య

దేశంలో వైద్య రంగం పేరుతో సాగుతున్న అక్రమ దందాలకు ఇది మరో దారుణ ఉదాహరణ. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 15 ఏళ్ల మైనర్ బాలికను డబ్బు ఆశ చూపి ఐవీఎఫ్ అండదానానికి బలిచేసిన ఘటన వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. చట్టాలను తుంగలో తొక్కుతూ, నకిలీ ఆధార్ కార్డు సృష్టించి బాలిక వయసును 25 ఏళ్లుగా మార్చి, అక్రమంగా ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అసలు ఏం జరిగిందంటే?

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఆ బాలిక తన స్నేహితురాలు పాలక్‌తో కలిసి వివిధ పెళ్లిళ్లలో వెయిట్రెస్‌గా పనిచేస్తూ జీవనం సాగించేది. ఈ క్రమంలో పాలక్, ఆమె తల్లి రింకీ కలిసి బాలికను లక్ష్యంగా చేసుకున్నారు. ఐవీఎఫ్ ప్రక్రియ గురించి తప్పుడు సమాచారం ఇచ్చి, కేవలం రూ.35,500 ఇస్తామని ఆశ చూపి ఆమెను ఒప్పించారు.

అనంతరం బాలికను సీమ అనే మహిళ వద్దకు తీసుకెళ్లారు. అక్కడే కుట్ర మరింత లోతుగా సాగింది. సీమ కుమారుడు హిమాన్షు ఓ మొబైల్ యాప్ సహాయంతో బాలిక ఆధార్ కార్డును ఎడిట్ చేసి, ఆమె వయసును 25 ఏళ్లుగా, వివాహితగా చూపిస్తూ నకిలీ పత్రాలు రూపొందించాడు. ఈ నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా ఒక ఐవీఎఫ్ సెంటర్‌లో ఏజెంట్‌గా పనిచేసే కల్పన సహకారంతో జనవరి 20న బాలికకు అక్రమంగా అండదాన ప్రక్రియ పూర్తి చేశారు.

పోలీసుల ఎంట్రీ – ఐదుగురు అరెస్ట్

ఫిబ్రవరి 6న బాలిక తల్లి తన కుమార్తె కనిపించడంలేదని, ఐవీఎఫ్ సెంటర్‌లో బలవంతంగా ఆపరేషన్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గంగా నగర్ డీసీపీ కుల్దీప్ సింగ్ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

నిందితుల మొబైల్ ఫోన్లను పరిశీలించగా, వివిధ వయసుల మహిళల ఫోటోలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. ఇది పెద్ద మాఫియాగా పనిచేస్తుందా? ఇంకా ఎంతమంది మహిళలు, మైనర్లు ఇలాగే బలయ్యారా? అనే కోణంలో లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

చట్టం ఏం చెబుతోంది?

భారతదేశంలో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం–2021 ప్రకారం అండదానానికి కఠిన నిబంధనలు ఉన్నాయి.

  • అండదాత వయసు 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
  • జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే అండదానం చేయాలి
  • ఒకసారి 7 అండాలకంటే ఎక్కువ సేకరించరాదు
  • దాత వివాహిత అయి ఉండాలి
  • కనీసం ఒక సంతానం కలిగి ఉండాలి

కానీ ఈ కేసులో నిందితులు ఈ నిబంధనలన్నింటినీ పూర్తిగా ఉల్లంఘించారు. ఒక మైనర్ బాలికను మోసం చేసి, వైద్య నైతిక విలువలను కాలరాస్తూ ఈ అక్రమానికి పాల్పడ్డారు.

ప్రస్తుతం నిందితులపై కిడ్నాప్, మానవ అక్రమ రవాణా, నకిలీ పత్రాల తయారీ వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐవీఎఫ్ సెంటర్ సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా ఐవీఎఫ్ కేంద్రాల పనితీరుపై, పర్యవేక్షణ వ్యవస్థలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి