ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ తీవ్రత పెరుగుతోంది. సదుం మండలంలోని పలు గ్రామాల తర్వాత ఇప్పుడు కార్వేటి నగరంలో వ్యాధి కలకలం రేపుతోంది. RKV పేట, ఇందిరా కాలనీ పరిధిలోని కోళ్ల ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. మృతిచెందిన కోళ్లను జాగ్రత్తలతో పూడ్చిపెడుతున్నట్లు అధికారులు తెలిపారు.
సోమవారం (ఫిబ్రవరి 9) ఒక్కరోజే వెయ్యికి పైగా కోళ్లు మరణించడంతో స్థానికులు, పౌల్ట్రీ ఫారం యజమానులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి విషయం చేరడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి కోళ్ల ఫారాలను పరిశీలించారు. కోళ్ల సామూహిక మరణాలకు గల కారణాలపై ప్రాథమిక విచారణ చేపట్టారు.
వ్యాధి నిర్ధారణ కోసం కోళ్ల బ్లడ్ శాంపిల్స్‌ను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపించారు. ఫలితాలు వచ్చే వరకు కోడి గుడ్లు, కోళ్ల అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అలాగే కోళ్ల ఫారాల్లోకి ఇతరులను, వాహనాలను అనుమతించవద్దని యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇక బర్డ్ ఫ్లూ వ్యాప్తి నివారణ కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక రాపిడ్ టీమ్ ఏర్పాటు చేసింది. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్ల పెంపకం, భారీగా ఎగుమతులు జరుగుతున్న నేపథ్యంలో పౌల్ట్రీ పరిశ్రమపై ప్రభావం పడకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.



