దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఆర్‌ఆర్‌బీ సెక్షన్ కంట్రోలర్ పరీక్షలు రేపటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఉపయోగపడేలా ఉచిత మాక్ టెస్ట్‌లను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మాక్ టెస్ట్‌లను రాయవచ్చు.
ఈ ఉచిత మాక్ టెస్ట్‌లకు ఎలాంటి పాస్‌వర్డ్ అవసరం లేకుండా నేరుగా యాక్సెస్ పొందే అవకాశం కల్పించారు. అభ్యర్థులు పరీక్ష విధానం, టైమ్ మేనేజ్‌మెంట్‌ను అర్థం చేసుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా మొదటిసారి పరీక్ష రాస్తున్నవారికి ఇవి మంచి సాధనగా మారనున్నాయి.
ఇక ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో సెక్షన్ కంట్రోలర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఇప్పటికే RRB వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. పరీక్ష కేంద్రం, షిఫ్ట్, రిపోర్టింగ్ టైమ్ వంటి వివరాలను అభ్యర్థులు ముందుగానే చెక్ చేసుకోవాలని సూచించారు.
కాగా, ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు ఎంపిక జరుగుతుంది. ఇదిలా ఉండగా, సీయూఈటీ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల సవరణ గడువు ఫిబ్రవరి 11తో ముగియనుంది. మే 11 నుంచి 31 మధ్య దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించనున్నారు.



