తెలంగాణ రైతులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. పంటల సీజన్ మొదలై నెలలు గడుస్తున్నా పెట్టుబడి సాయం అందక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ రావడంతో రైతుల్లో కొంత ఊరట కలిగింది.
రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 13వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఎన్నికల కోడ్ కారణంగా రైతు భరోసా నిధుల విడుదలకు ఇప్పటివరకు బ్రేక్ పడింది. అయితే కౌంటింగ్ పూర్తయ్యాక వెంటనే రైతు భరోసా డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం.
ప్రభుత్వం ఇప్పటికే ఈ దిశగా ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఎదురవుతుండటంతో, ఆర్బీఐ నుంచి రుణం తీసుకునే దిశగా చర్యలు చేపట్టింది. ఈ నెల 10న ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా రూ.9 వేల కోట్ల నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం ఇండెంట్ పెట్టినట్లు సమాచారం. ఈ నిధులు అందిన వెంటనే రైతు భరోసా పంపిణీకి మార్గం సుగమం కానుంది.
ప్రణాళిక ప్రకారం ఒక్కో ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. నిజానికి జనవరిలోనే ఈ నిధులు విడుదల చేయాల్సి ఉండగా, పలు కారణాలతో జాప్యం జరిగింది. ముఖ్యంగా శాటిలైట్ సర్వే ప్రక్రియ పూర్తి కాకపోవడం ఆలస్యానికి కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం శాటిలైట్ సర్వే ఆధారంగా పంట సాగవుతున్న భూములపై నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదిక ప్రకారం దాదాపు 10 శాతం భూముల్లో పంట సాగు జరగడం లేదని తేలినట్లు ప్రచారం సాగుతోంది. ఈ భూములకు రైతు భరోసా వర్తించదన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
మొత్తంగా చూస్తే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత రైతు భరోసా నిధుల విడుదలకు మార్గం క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. దీంతో ఈ నెల 13 తర్వాత రైతుల అకౌంట్లలో డబ్బులు జమయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.



