జగన్ భద్రతలో లోపాలు నిజమేనా? కేంద్ర హోంశాఖ విచారణ కోరిన వైసీపీ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై మరోసారి తీవ్ర చర్చ ప్రారంభమైంది. జిల్లాల పర్యటనల సమయంలో జగన్‌కు తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జగన్ భద్రతలో చోటు చేసుకుంటున్న లోపాలపై విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు నేరుగా లేఖ పంపింది.

వైసీపీ ముఖ్య నేత తలశిల రఘురాం కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో, జగన్ జిల్లాల పర్యటనల సందర్భంగా జరుగుతున్న పరిణామాలను వివరించారు. జెడ్ ప్లస్ భద్రత కలిగిన వీవీఐపీ అయిన జగన్‌కు అవసరమైన భద్రతా ప్రమాణాలు పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు.

ఇటీవల తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే సమయంలో భద్రతా పరంగా తీవ్ర లోపాలు కనిపించాయని లేఖలో పేర్కొన్నారు. సాధారణంగా 22 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పక్కనపెట్టి, ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా 47 కిలోమీటర్ల పొడవైన మార్గానికి రూట్ మార్పు చేయడం ఆందోళన కలిగించే అంశమని వివరించారు. ఈ రూట్ మార్పు గురించి భద్రతా సిబ్బందికి కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపారు.

సూచించిన మార్గం అత్యంత రద్దీగా ఉండటంతో పాటు, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వీవీఐపీ ప్రయాణానికి ఏ మాత్రం అనుకూలంగా లేదని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి అనూహ్య రూట్ మార్పులు భద్రతా ప్రోటోకాల్స్‌ను బలహీన పరుస్తాయని, తద్వారా వీవీఐపీ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశముందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది.

ముందస్తు భద్రతా అంచనా లేకుండా, లిఖితపూర్వక సమాచారం ఇవ్వకుండా తీసుకుంటున్న సడన్ నిర్ణయాల వల్ల ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశముందని లేఖలో స్పష్టం చేశారు. ఇది ఒక్క ఘటన మాత్రమే కాదని, గతంలో కూడా ఇలాంటి నిర్లక్ష్య నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని వివరించారు.

జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ చేపట్టి, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖను వైసీపీ లేఖలో కోరింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి