పాస్‌పోర్ట్ కోసం ఫోటో తీస్తున్నప్పుడు “నవ్వకండి” అని చెప్పడాన్ని చాలామంది లైట్‌గా తీసుకుంటారు. కానీ దీనివెనుక ఒక బలమైన శాస్త్రీయ కారణం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది వ్యక్తిగత అభిరుచులకు సంబంధించిన నియమం కాదు.. పూర్తిగా సాంకేతిక, భద్రతా కారణాలతో రూపొందించబడింది.
పాస్‌పోర్ట్ ఫోటోల్లో నవ్వడాన్ని నిషేధించడానికి ప్రధాన కారణం బయోమెట్రిక్ ముఖ గుర్తింపు వ్యవస్థ. మీరు ఫోటోలో నవ్వినప్పుడు ముఖ ఆకృతి మారిపోతుంది. బుగ్గలు పైకి లేవడం, కళ్ళు కొంచెం చిన్నవిగా మారడం, నోరు వెడల్పవడం వంటి మార్పులు జరుగుతాయి. ఒక చిన్న చిరునవ్వు కూడా ముఖంలోని నిష్పత్తులను గణనీయంగా మార్చేస్తుంది.
ఫోరెన్సిక్ సైన్స్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, నవ్వుతున్న ముఖంతో పోలిస్తే తటస్థ ముఖాన్ని (Neutral Face) గుర్తించడం బయోమెట్రిక్ సిస్టమ్‌లకు చాలా సులభం, ఖచ్చితమైనదిగా తేలింది. ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ భావోద్వేగాలను గుర్తించదు. అది మీ ముఖాన్ని సంఖ్యలు, గణిత నమూనాల రూపంలో మాత్రమే పరిశీలిస్తుంది. మీరు నవ్వితే ఆ నమూనా మారిపోతుంది. దీంతో యంత్రానికి గందరగోళం ఏర్పడి మ్యాచ్ ఖచ్చితత్వం తగ్గుతుంది.
ప్రతిరోజూ వేలాది మంది విమానాశ్రయాల్లో ఈ-గేట్లు, ఆటోమేటెడ్ చెక్ సిస్టమ్‌ల ద్వారా ముఖ గుర్తింపుకు లోనవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పొరపాటు కూడా భద్రతా సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా సరిహద్దు నియంత్రణ సంస్థలు ఒకే విధమైన నియమాలను పాటిస్తున్నాయి.
పాస్‌పోర్ట్ దరఖాస్తు సమయంలో నవ్వుతున్న ఫోటో ఇస్తే, అధికారులు దానిని తిరస్కరించే అవకాశం ఉంది. ముఖ్యంగా దంతాలు కనిపించడం, కళ్ళు పూర్తిగా తెరవకపోవడం, ముఖ కండరాలు బిగుతుగా ఉండటం వంటి పరిస్థితుల్లో కొత్త ఫోటో అడుగుతారు. దీని వల్ల పాస్‌పోర్ట్ ప్రక్రియ ఆలస్యం కావచ్చు. మళ్లీ ఫోటో తీయించుకోవాల్సి రావడంతో సమయం, డబ్బు రెండూ నష్టం అవుతాయి.
అంతేకాదు, నవ్వుతున్న ఫోటో ఉంటే విమానాశ్రయాల్లోని ఈ-గేట్లు మిమ్మల్ని గుర్తించడంలో విఫలమయ్యే అవకాశం ఉంది. అప్పుడు మాన్యువల్ వెరిఫికేషన్ కోసం పొడవైన క్యూలలో నిలబడాల్సి రావచ్చు.
కాలక్రమేణా మన ముఖం మారుతుంటుంది. బరువు, చర్మం, జుట్టు అన్నీ మారినా తటస్థ ముఖం మాత్రం ఎక్కువ కాలం స్థిరంగా ఉంటుంది. అందుకే నవ్వకుండా తీసిన పాస్‌పోర్ట్ ఫోటో మీ గుర్తింపును దీర్ఘకాలం సురక్షితంగా నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఈ నియమం వ్యక్తిగతం కాదు.. పూర్తిగా సాంకేతిక భద్రతకు సంబంధించినదని గుర్తించాలి.



