80, 90లలో దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన నటి ఖుష్బూ సుందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అప్పట్లో ఆమె అందం, నటనకు ముగ్ధులైన అభిమానులు ఏకంగా ఆమెకు గుడి కూడా కట్టిన విషయం తెలిసిందే.
హీరోయిన్గా సుదీర్ఘ కాలం వెలుగొందిన ఖుష్బూ ప్రస్తుతం సహాయ నటిగా, కీలక పాత్రల్లో నటిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ చురుగ్గా పాల్గొంటూ పలు టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ తన సినీ ప్రస్థానం, అప్పటి అనుభవాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 1986లో తెలుగు సినిమాతో తన కెరీర్ ప్రారంభమైందని, వెంకటేష్ హీరోగా నటించిన చిత్రంలో తొలిసారి హీరోయిన్గా అవకాశం లభించిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున, రాజేంద్ర ప్రసాద్ వంటి పలువురు తెలుగు స్టార్ హీరోలతో కలిసి పనిచేశానని తెలిపారు.
అయితే బాలకృష్ణ, చిరంజీవి వంటి అగ్ర హీరోలతో హీరోయిన్గా నటించే అవకాశం రాలేదని ఖుష్బూ చెప్పారు. అందుకు కారణంగా అప్పట్లో తమిళ, కన్నడ చిత్రాల నుంచి ఎక్కువ ఆఫర్లు రావడం, చెన్నైలోనే సెటిల్ కావడం వల్ల డేట్ల సమస్యలు ఎదురవ్వడమేనని వివరించారు. అదే సమయంలో తెలుగు సినీ పరిశ్రమ కేంద్రం చెన్నై నుంచి హైదరాబాద్‌కు మారడం కూడా తన కెరీర్‌పై ప్రభావం చూపిందని పేర్కొన్నారు.
‘చంటి’ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ, రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రాల డేట్లు క్లాష్ కావడంతో ఆ ఆఫర్‌ను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అలాగే బాలకృష్ణ సినిమాతో కూడా పని చేయలేకపోయానని చెప్పారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలో ఆయనకు అక్క పాత్రలో కనిపించానని ఖుష్బూ గుర్తు చేసుకున్నారు.
ఇక 1980ల నాటి నటీనటుల రీయూనియన్ గురించి మాట్లాడుతూ, అది తమ జీవితాల్లో చాలా ప్రత్యేకమైన అనుభూతి అని అన్నారు. “క్లాస్ ఆఫ్ 80స్” అనే వాట్సాప్ గ్రూప్‌లో 36 మంది సభ్యులు ఉన్నారని, అందరూ రోజూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ పాత జ్ఞాపకాలను పంచుకుంటారని చెప్పారు. ఆ రీయూనియన్లలో స్టార్ ఇమేజ్ మరిచి చిన్నపిల్లలలా సరదాగా గడుపుతామని ఖుష్బూ వెల్లడించారు.



