విజయనగరం: కస్టమర్ డాక్యుమెంట్లు పోగొట్టిన SBIకి భారీ జరిమానా

విజయనగరంలో బ్యాంకుల నిర్లక్ష్యంపై జిల్లా వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. కార్ లోన్ భద్రతగా డిపాజిట్ చేసిన ఖాళీ భూమి ఒరిజనల్ డాక్యుమెంట్లు పోయిన ఘటనలో ఎస్బీఐ కంటోన్మెంట్ బ్రాంచ్‌పై చర్యలు తీసుకుంది.

ఉడా కాలనీలో నివసించే ఓ వ్యక్తి 2000లో కార్ లోన్ కోసం ఎస్బీఐని ఆశ్రయించి, భూమి ఒరిజనల్ పత్రాలను బ్యాంకులో జమ చేశారు. 2013లో లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వమని కోరినా, బ్యాంకు సిబ్బంది కాలయాపన చేశారు. చివరకు పత్రాలు పోయాయని చెప్పడంతో బాధితుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

విచారణలో బ్యాంకు నిర్లక్ష్యం స్పష్టమవడంతో, బాధితుడికి రూ.3 లక్షల పరిహారం, రూ.20 వేల న్యాయ ఖర్చులతో కలిపి మొత్తం రూ.3.20 లక్షలు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. అలాగే డాక్యుమెంట్లు పోయిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, సర్టిఫైడ్ డూప్లికేట్ పత్రాలు, ఇండెమ్నిటీ బాండ్ ఇవ్వాలని సూచించింది.

ఈ తీర్పు బ్యాంకులు కస్టమర్ పత్రాలను భద్రంగా ఉంచాల్సిన బాధ్యత ఎంత కీలకమో గుర్తు చేస్తోందని కమిషన్ స్పష్టం చేసింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి