తెలుగులో కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు నటుడు సుదర్శన్. హీరో ఫ్రెండ్ రోల్స్‌లో, నెల్లూరు యాస డైలాగ్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ కమెడియన్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన సినీ ప్రయాణంలో ఎదురైన ఓ అనుభవాన్ని గుర్తు చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సినీ ఇండస్ట్రీలోకి రాకముందు తాను ప్రభాస్‌కు వీరాభిమానినని సుదర్శన్ వెల్లడించాడు. ‘వర్షం’ సినిమా నుంచే ప్రభాస్ సినిమాలన్నీ ఫాలో అయ్యేవాడినని చెప్పాడు. హైదరాబాద్‌లో ఐఎల్టీఎస్ కోచింగ్ పూర్తి చేసి ఇంటికి వెళ్లే సమయంలో ప్రభాస్ పుట్టినరోజు రావడంతో, ఆయన్ని కలవాలనే ఆశతో ప్రభాస్ ఇంటి వద్దకు వెళ్లినట్లు తెలిపాడు.
తెల్లవారుజామున 6 గంటల నుంచి వర్షంలో తడుస్తూ రాత్రి 1 గంట వరకు ప్రభాస్ ఇంటి గేట్ దగ్గరే నిలబడ్డానని చెప్పాడు. టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా లేకుండా ఎదురు చూశానని తెలిపాడు. అయితే అప్పట్లో ప్రభాస్ కేరళలో ఉన్నారని ఎంత చెప్పినా వినకుండా అక్కడే ఉండిపోయానని గుర్తు చేసుకున్నాడు. ఇప్పటికీ ప్రభాస్‌ను కలిసి ఈ విషయం చెప్పాలనే కోరిక ఉందని సుదర్శన్ చెప్పడం అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది.



