ప్రపంచంలో ఇప్పటివరకు నమోదైన అత్యంత పొడవైన భారీ కొండచిలువ (పైథాన్) ను ఇండోనేషియాలోని సులవేసి ప్రాంతంలో గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారీ కొండచిలువను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతూ, అనకొండ సినిమాల్లో చూసిన దృశ్యాలు నిజ జీవితంలోనూ ఉన్నాయా? అంటూ చర్చించుకుంటున్నారు.
సాధారణంగా అమెజాన్ నది పరివాహక ప్రాంత అడవులు భారీ అనకొండలకు నెలవుగా భావిస్తుంటారు. కానీ, ఇండోనేషియా ప్రాంతం కూడా భారీ కొండచిలువలు, అనకొండలకు అనుకూలమైన సహజావాసంగా కొనసాగుతోంది. అక్కడ వివిధ రకాల భారీ పైథాన్ జాతులు ఇప్పటికీ జీవిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మనుషులను మింగిన ఘటనలు కూడా వెలుగుచూడడం భయాందోళనలకు దారి తీస్తోంది.
సులవేసిలో కొత్త ప్రపంచ రికార్డు
ఇండోనేషియాలోని సులవేసి ప్రాంతంలో గుర్తించిన ఈ ఆడ మలయ్ కొండచిలువకు “ఇబు బారన్” అనే పేరు పెట్టారు. దీని పొడవు 7.22 మీటర్లు (23 అడుగులు 8 అంగుళాలు) కాగా, బరువు సుమారు 97 కిలోలు. జనవరి 18న ఈ పైథాన్ పొడవును అధికారికంగా కొలిచినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెల్లడించింది. దీంతో ఇది ప్రపంచంలోనే ఇప్పటివరకు గుర్తించిన అత్యంత పొడవైన అడవి పైథాన్గా రికార్డు సృష్టించింది.
ఈ భారీ సర్పాన్ని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఇదే సులవేసి ప్రాంతంలోనే 1912 సంవత్సరంలో 10 మీటర్ల (32 అడుగులు 10 అంగుళాలు) పొడవు ఉన్న మరో భారీ పైథాన్ను కాల్చి చంపిన ఘటన చరిత్రలో నమోదై ఉండటం గమనార్హం.
పెంపుడు పైథాన్లలో ‘మెడుసా’ రికార్డు
పెంపుడు పైథాన్ల విభాగంలో మాత్రం అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం, కాన్సాస్ సిటీలో ఉన్న ఎడ్జ్ ఆఫ్ హెల్ హాంటెడ్ హౌస్ లో పెంచిన “మెడుసా” పాముదే ఇప్పటికీ ప్రపంచ రికార్డు. ఈ రెటిక్యులేటెడ్ ఆడ పైథాన్ (Malayopython reticulatus) పొడవు 7.67 మీటర్లు (25.2 అడుగులు) కాగా, బరువు 158.8 కిలోలు (350 పౌండ్లు).
చివరిసారిగా 2011లో దీని పొడవును కొలిచారు. అప్పటికి ఈ పాము వయసు 10 సంవత్సరాలు కాగా, దాని పూర్తి పొడవును కొలవడానికి 15 మంది వ్యక్తులు అవసరమయ్యారంటే దాని భారీదనం ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మెడుసాకు ఆహారంగా రెండు వారాలకు ఒకసారి కుందేళ్లు, పందులు, జింకల మాంసాన్ని అందించేవారు.
ఒక్కసారిగా 18 కిలోల (40 పౌండ్ల) జింకను పూర్తిగా మింగగల సామర్థ్యం ఈ పాముకు ఉండటం విశేషం. రెటిక్యులేటెడ్ పైథాన్లు ప్రధానంగా ఆగ్నేయాసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ప్రాంతాల్లో నివసిస్తాయి. ఇవి నీటిలో చక్కగా ఈదగల సర్పజాతిగా కూడా ప్రసిద్ధి చెందాయి.



