ఏపీలో 20 లక్షల అసంఘటిత కార్మికుల నైపుణ్యాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆదేశాలు

రాష్ట్రంలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న సుమారు 20 లక్షల మంది కార్మికుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణం సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు అమలులో ఉన్న సంక్షేమ పథకాలను పునరుద్ధరించి మరింత బలోపేతం చేయాలని సూచించారు.

కార్మికుల సంక్షేమంలో భాగంగా ప్రసూతి సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం, వివాహానికి రూ.40 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేల చొప్పున సహాయం అందించే విధానాన్ని అమలు చేయాలని సీఎం పేర్కొన్నారు. అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు ఉచిత వైద్య సేవలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అసంఘటిత రంగంలోని కార్మికులను మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే దిశగా విధానాలు రూపొందించాలని సూచించారు. కార్మికులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించాలని తెలిపారు. యూనివర్సల్ హెల్త్ పాలసీతో పాటు కార్మిక శాఖ ద్వారా రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలు అందించి, ఆపై ఖర్చును ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ద్వారా భరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్మిక శాఖ సమీక్ష సమావేశంలో పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలు కార్మికుల్లో పెంపొందించే అంశంపై సీఎం దిశానిర్దేశం చేశారు. నిర్మాణ రంగంలోని ఎల్ అండ్ టి, ఎన్‌సీసీ, మిట్టల్ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో అవసరమైన స్కిల్ ట్రైనింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాల వారీగా, రంగాల వారీగా కార్మికుల సమగ్ర డేటాబేస్ రూపొందించాలని సూచించిన ముఖ్యమంత్రి, గిగ్ వర్కర్లు మరియు నిర్మాణ రంగ కార్మికుల ఆదాయాలు పెరిగేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా ఏపీ కార్మికులు విదేశాల్లోనూ ఉద్యోగాలు సాధించి మెరుగైన ఆదాయాలు పొందేలా చూడాలని తెలిపారు. నైపుణ్య పోర్టల్‌కు అనుసంధానించి వివిధ కోర్సులు అభ్యసించి విద్యార్హతలు పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో పాటు కార్మిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి