యాలకులు అంటే కేవలం వంటకాలకు పరిమళం ఇచ్చే సుగంధ ద్రవ్యమే కాదు. ఇందులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. యాలకుల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ పరిమిత మోతాదులో యాలకులు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రతి ఒక్కరికీ యాలకులు సరిపోతాయన్నది కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా యాలకులను వంటల్లో ఉపయోగిస్తారు. కానీ కొందరు రోజూ నేరుగా యాలక గింజలను నములుతుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో పాజిటివ్ మార్పులు కనిపిస్తాయి. యాలకులు జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భోజనం తర్వాత ఒక యాలక గింజ నమలితే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులో మంట తగ్గడమే కాకుండా జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది.
యాలకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని హానికర బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గి, చిగుళ్ల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రించడంలో యాలకులు సహాయపడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరచి గుండె సంబంధిత సమస్యల ముప్పును తగ్గిస్తాయి. తరచూ దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి యాలకులు మంచి ఉపశమనం ఇస్తాయి.
యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
యాలకులు ఊపిరితిత్తుల్లో గాలి ప్రవాహాన్ని మెరుగుపరచి శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తాయి. నేటి జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. అలాంటి వారు యాలకుల టీ తాగినా లేదా నోట్లో వేసుకుని నమిలినా మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది.
అయితే, యాలకులు ఎన్నో ప్రయోజనాలు కలిగించినా కొందరు మాత్రం వీటికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో చికిత్స తీసుకుంటున్నవారు యాలకులను ఎక్కువగా వినియోగించకూడదు. అలాగే కిడ్నీ రాళ్లు ఉన్నవారు యాలకులు తీసుకోవడం మానేయడం మంచిది. గర్భిణులు కూడా యాలకుల వినియోగంపై జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. చర్మ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు యాలకులకు దూరంగా ఉండటం ద్వారా సమస్యలు పెరగకుండా చూసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.



