దేవుడి ఆభరణాలు దొంగిలించిన పిల్లలకు ఊరేగింపు.. నిజామాబాద్ గ్రామం వింత ఆచారం

గ్రామాల్లో దొంగతనం చేస్తూ పట్టుబడితే శిక్ష ఖాయం. కానీ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామంలో మాత్రం పూర్తిగా భిన్నమైన ఆచారం కొనసాగుతోంది. ఇక్కడ దేవుడి ఆభరణాలు దొంగిలించిన చిన్నారులను చితకబాదటం కాదు.. భజంత్రీలు, డప్పులతో ఊరేగించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తారు.

ఈ వింత ఆచారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతుంది. 1928లో ఆలయం నిర్మించిన నాటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నారులు ‘ఉత్తుత్తి దొంగలు’గా మారి స్వామివారి ఆభరణాలను తీసుకుని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద దాక్కుంటారు.

ఆ తర్వాత గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో వెళ్లి దొంగలను పట్టుకుని, తాళ్లతో కట్టి గుడికి తీసుకొచ్చి ప్రదక్షిణలు చేయిస్తారు. అనంతరం స్వామివారి ముందు క్షమాపణ చెప్పించి, దొంగిలించిన వస్తువులను తిరిగి సమర్పిస్తారు. ఈ ఘట్టాన్ని ‘దొంగల దోపిడీ మహోత్సవం’గా పిలుస్తారు.

ఈ ఆచారం వల్ల గ్రామంలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా, పిల్లలు చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉండేందుకు ఇది దోహదపడుతుందని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి