విద్య నేర్పాల్సిన కాలేజీ చైర్మన్‌నే కాలయముడయ్యాడా? తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని దీశ్మాంజలి ఆత్మహత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కాలేజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ చేసిన లైంగిక వేధింపులు, కెరీర్ నాశనం చేస్తానన్న బెదిరింపులే ఆ యువతి ప్రాణాలు తీశాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
తిరుపతిలోని బాలాజీ నర్సింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న దీశ్మాంజలి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆత్మహత్య మాత్రమే కాదని, కాలేజీ యాజమాన్య వేధింపులే కారణమని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కూలీ పనులు చేసుకుంటూ కూతురిని చదివించిన తల్లిదండ్రులు, తమ బిడ్డ మరణంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.
దీశ్మాంజలిని చైర్మన్ ప్రవీణ్ కుమార్ లైంగికంగా వేధించాడని, విషయం బయటకు చెబితే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహా వేధింపులు ఇతర విద్యార్థినులపైనా జరిగాయని ఆరోపణలు రావడంతో కేసు మరింత తీవ్రమైంది.
బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు చైర్మన్‌పై కేసు నమోదు చేశారు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు, ఆత్మహత్యకు ముందు విద్యార్థిని వీడియో కాల్ చేసిన ఆధారాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్‌లు, కాలేజీ రికార్డులతో పాటు అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.



