మీరు రోజూ మీ పొదుపు ఖాతా ద్వారా చెల్లింపులు చేయడం, డబ్బు బదిలీ చేయడం, నగదు ఉపసంహరణలు చేయడం సాధారణమే. అయితే ఈ సాధారణ లావాదేవీలే కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వెళ్లే అవకాశముందన్న విషయం చాలా మందికి తెలియదు.
పొదుపు ఖాతా కేవలం డబ్బు నిల్వ చేయడానికి, ఖర్చు చేయడానికి మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆధునిక టెక్నాలజీతో ఆదాయపు పన్ను శాఖ ప్రతి ప్రధాన ఆర్థిక లావాదేవీని పర్యవేక్షిస్తోంది. ముఖ్యంగా ఖాతాలోకి, ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తరచుగా కదలికలు జరిగితే లేదా మీ ఆదాయానికి మించి ఖర్చులు చేస్తున్నట్లు కనిపిస్తే పన్ను శాఖ విచారణకు అవకాశం ఉంటుంది.
నోటీసు రావచ్చు
బ్యాంకులు కొన్ని రకాల లావాదేవీలను తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లావాదేవీలు మీ ఆదాయానికి సరిపోలని విధంగా కనిపిస్తే పన్ను నోటీసు రావచ్చు. చార్టర్డ్ అకౌంటెంట్లు అభిషేక్ సోని, తరుణ్ కుమార్ మదన్‌లు పేర్కొన్నట్లుగా, హానికరం కాదనిపించే కొన్ని లావాదేవీలు కూడా విచారణకు కారణమయ్యే అవకాశం ఉంది.
ఇప్పుడు మీ పొదుపు ఖాతా పన్ను శాఖ నిఘాలో పడే 10 ప్రధాన కారణాలు ఏంటో చూద్దాం…
1. భారీ నగదు డిపాజిట్లు
ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమైతే, బ్యాంకు ఈ సమాచారాన్ని పన్ను శాఖకు పంపుతుంది. ఇది తప్పు కాదు. కానీ ఆ డబ్బు మూలాన్ని మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. బహుమతులు, ఆస్తి విక్రయం లేదా వ్యాపార ఆదాయానికి సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలి.
2. భారీ క్రెడిట్ కార్డ్ చెల్లింపులు
నెలకు రూ.1 లక్షకు మించి నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ చెల్లింపులు చేసినా లేదా ఏడాదిలో రూ.10 లక్షలకు మించి కార్డ్ చెల్లింపులు ఉంటే పన్ను శాఖ దృష్టికి వెళ్తాయి. మీ జీవనశైలి, ఆదాయం సరిపోతున్నాయా అనే కోణంలో పరిశీలన జరుగుతుంది.
3. తరచూ భారీ నగదు ఉపసంహరణలు
పొదుపు ఖాతా నుంచి పదే పదే పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రాలు చేయడం లేదా అకస్మాత్తుగా నగదు ప్రవాహం పెరగడం బ్యాంకులను అప్రమత్తం చేస్తుంది. ఇది ఆదాయంతో సరిపోలకపోతే ప్రశ్నలు తలెత్తుతాయి.
4. రూ.30 లక్షలు దాటిన ఆస్తి లావాదేవీలు
రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తి కొనుగోలు లేదా విక్రయం జరిగినప్పుడు, రిజిస్ట్రార్ ఆ వివరాలను పన్ను శాఖకు నివేదిస్తారు. డబ్బు మూలం గురించి విచారణ జరగవచ్చు.
5. నిలిచిపోయిన ఖాతాల్లో అకస్మాత్తు లావాదేవీలు
చాలా కాలంగా నిలిచిపోయిన ఖాతా ఒక్కసారిగా యాక్టివ్ అయి పెద్ద లావాదేవీ జరిగితే బ్యాంకు దానిని ఫ్లాగ్ చేస్తుంది. వ్యాపారం, వారసత్వం లేదా ఇతర చట్టబద్ధమైన కారణాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి.
6. విదేశీ లావాదేవీలు ఎక్కువైతే
అంతర్జాతీయ కార్డ్ చెల్లింపులు లేదా ఫారెక్స్ ద్వారా ఏడాదిలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే, ముఖ్యంగా ఆదాయం తక్కువగా ఉన్నట్లు కనిపిస్తే పన్ను నోటీసుకు అవకాశం ఉంటుంది.
7. బ్యాంక్ వడ్డీ – ఐటీఆర్ మధ్య తేడా
బ్యాంకులు నివేదించిన వడ్డీ వివరాలు మీ ఐటీఆర్‌కు సరిపోలకపోతే నోటీసు రావచ్చు. ఫారమ్ 26AS, AIS (వార్షిక సమాచార ప్రకటన)లోని వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.
8. సేవింగ్స్ ఖాతా వడ్డీని చూపించకపోవడం
వడ్డీ ఆదాయం రూ.10,000 కంటే తక్కువగా ఉన్నా, అది AISలో కనిపిస్తుంది. ఐటీఆర్‌లో చూపించకపోతే డేటా మిస్‌మ్యాచ్ వల్ల ఆటోమేటిక్ నోటీసు రావచ్చు.
9. అనేక బ్యాంకు ఖాతాలు
బహుళ పొదుపు ఖాతాలు ఉండటం తప్పు కాదు. కానీ అన్ని ఖాతాల వడ్డీని కలిపి ఐటీఆర్‌లో చూపించాలి. చిన్న తప్పులు కూడా ఇప్పుడు సిస్టమ్ గుర్తిస్తోంది.
10. ఇతరుల కోసం చెల్లింపులు చేస్తే జాగ్రత్త
పండుగలు, కార్యక్రమాల సమయంలో మీ కార్డ్‌తో ఇతరుల బిల్లులు చెల్లించి, వారు మీకు నగదు ఇచ్చినప్పుడు ఆ లావాదేవీలు ట్రాక్ అవుతాయి. ఆ డబ్బు ఖాతాలో జమైతే రిపోర్టింగ్ పరిమితి మించి నోటీసు రావచ్చు.
పన్ను శాఖ పరిశీలన నుంచి తప్పించుకోవాలంటే…
పాన్ ఆధారిత ఆటో రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా అన్ని ప్రధాన లావాదేవీలు పన్ను శాఖకు చేరుతున్నాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి.
• ఐటీఆర్ దాఖలు చేసే ముందు AIS, ఫారమ్ 26AS పూర్తిగా తనిఖీ చేయండి.
• ప్రతి లావాదేవీకి సంబంధించిన డాక్యుమెంట్లను భద్రపరుచుకోండి.
• ఇతరుల తరఫున లావాదేవీలు చేస్తే స్పష్టమైన రికార్డులు ఉంచండి.
ఇలా జాగ్రత్తలు తీసుకుంటే అనవసర ఆదాయపు పన్ను నోటీసుల నుంచి తప్పించుకోవచ్చు.



