Political Leaders Plane Crashes: బల్వంతరాయ్ నుంచి అజిత్ పవార్ వరకు వెంటాడిన విమాన ప్రమాదాలు

భారత రాజకీయ చరిత్రలో విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు అనేక కుటుంబాలను, రాష్ట్రాలను శోకసంద్రంలో ముంచాయి. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. గత ఏడు నెలల్లో ప్రముఖ రాజకీయ నాయకుడు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

వరుసగా రాజకీయ వర్గాలను కుదిపేస్తున్న ప్రమాదాలు

జూన్ 2025లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విమాన ప్రమాదంలో మృతి చెందగా, ఇప్పుడు అజిత్ పవార్ మరణం మరోసారి రాజకీయ వర్గాలను షాక్‌కు గురి చేసింది. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఏడుగురు ప్రముఖ రాజకీయ నాయకులు విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కొందరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడే మరణించడం మరింత విషాదకరం.

విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖ నాయకులు

బల్వంతరాయ్ మెహతా

1963 నుంచి 1965 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బల్వంతరాయ్ మెహతా, 1965 యుద్ధ సమయంలో రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంపై తనిఖీ కోసం విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ విమానం కూల్చివేయడంతో మెహతాతో పాటు ఆయన భార్య, ఉద్యోగులు, జర్నలిస్ట్ సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో విమాన ప్రమాదంలో మరణించిన తొలి ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచారు.

సంజయ్ గాంధీ

1980 జూన్ 23న, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీలో విమాన ప్రయాణంలో ఉన్నారు. విమానాన్ని స్టంట్ చేస్తుండగా అది కూలిపోయి సంజయ్ గాంధీతో పాటు సహ ప్రయాణికుడు సుభాష్ సక్సేనా అక్కడికక్కడే మరణించారు.

మాధవరావు సింధియా

ప్రముఖ కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా 2001 సెప్టెంబర్ 30న విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్‌లో జరగనున్న ర్యాలీకి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న విమానం ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి సమీపంలో కూలిపోయింది.

జి.ఎం.సి. బాలయోగి

లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన గంటి మోహన చంద్ర బాలయోగి 2002లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

వై.ఎస్. రాజశేఖర రెడ్డి

2009 సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నల్లమల అడవుల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయి, రాష్ట్రం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

విజయ్ రూపానీ

జూన్ 12, 2025న అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో ఉన్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మృతి చెందారు. కుటుంబాన్ని కలవడానికి లండన్ వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

దోర్జీ ఖండు

2011లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తవాంగ్ నుంచి ఇటానగర్‌కు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న విమానం అదృశ్యమై, అనంతరం ప్రమాదానికి గురైనట్లు నిర్ధారణైంది.

అజిత్ పవార్

తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం బారామతిలో ల్యాండింగ్ సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న పలువురు మృతి చెందారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బారామతికి వెళ్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి