పాడి రైతులకు శుభవార్త: ఏపీలో పాడి పశువుల బీమా పథకం అమలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు వ్యవసాయం మాత్రమే కాకుండా పాడి పశుపోషణపై కూడా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అలాంటి పాడి రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాడి పశువుల నష్టాన్ని తగ్గించేందుకు పాడి పశువుల బీమా పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

పంటలకు ఎలా అయితే బీమా రక్షణ ఉంటుందో, అదే విధంగా పాడి పశువులకు కూడా బీమా కల్పించి రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ప్రీమియంలో 85 శాతం ప్రభుత్వమే భారం

పశువులు అనారోగ్యం లేదా ప్రమాదాల కారణంగా మరణించినప్పుడు రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం కలగకుండా పరిహారం అందించడమే ఈ పథక ప్రధాన లక్ష్యం. ఈ బీమా పథకంలో భాగంగా మొత్తం ప్రీమియంలో కేవలం 15 శాతం మాత్రమే రైతు చెల్లించాలి, మిగిలిన 85 శాతం ప్రీమియాన్ని ప్రభుత్వం భరిస్తుంది.

రైతు చెల్లించేది కేవలం రూ.288 మాత్రమే

ఈ బీమా పథకం ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు వంటి పశువులకు వర్తిస్తుంది. ఒక్కో రైతుకు గరిష్టంగా 10 ఆవులు లేదా గేదెలు, 100 గొర్రెలు లేదా మేకలు, 50 పందులు వరకు బీమా సౌకర్యం ఉంటుంది.
రూ.30,000 విలువైన పశువుకు రైతు కేవలం రూ.288 మాత్రమే ప్రీమియంగా చెల్లిస్తే సరిపోతుంది.

పశువుల విలువను బట్టి బీమా మొత్తం

రూ.15,000 విలువైన పశువుకు రూ.144, రూ.6,000 విలువైన గొర్రెలు లేదా మేకలకు కేవలం రూ.27 మాత్రమే ప్రీమియంగా చెల్లించాలి.
మేలు జాతి ఆవులు, గేదెలకు రూ.15,000 నుంచి రూ.30,000 వరకు బీమా వర్తిస్తుంది. మేలు జాతి ఎద్దులు, దున్నలకు రూ.30,000 వరకు, నాటు ఎద్దులు, దున్నలకు రూ.15,000 వరకు బీమా కల్పిస్తారు. గొర్రెలు, మేకలకు రూ.6,000 బీమా ఉంటుంది.

జనవరి 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి

ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం రైతులను కోరుతోంది. జనవరి 31వ తేదీ లోపు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాలలో పశువులకు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని, బీమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ బీమా మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాకు జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి