తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహాలకు నూతన వధూవరుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. తిరుమల పాపావినాశనం రోడ్డులో ఉన్న కళ్యాణ వేదికలో 2016 ఏప్రిల్ 25 నుంచి టీటీడీ ఉచితంగా వివాహాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి 2025 డిసెంబర్ 31 వరకు మొత్తం 26,777 వివాహాలు విజయవంతంగా జరిగాయి.
ఈ ఉచిత వివాహాల సందర్భంగా పురోహిత సేవలు, మంగళవాయిద్యం, పసుపు, కుంకుమ, కంకణం వంటి ముఖ్యమైన వివాహ సామగ్రిని టీటీడీ ఉచితంగా అందిస్తోంది. అయితే, వివాహానికి అవసరమైన ఇతర వస్తువులను వధూవరులే స్వయంగా సమకూర్చుకోవాలి. పెళ్లికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉండగా, ఏదైనా కారణంతో వారు రాలేని పరిస్థితిలో సంబంధిత ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
వివాహం అనంతరం పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతో పాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం ఆరుగురికి (తల్లిదండ్రుల్లో ఎవరు మరణించి ఉంటే మిగిలిన వారికి మాత్రమే) రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన సదుపాయం కల్పిస్తున్నారు. ఏటీసీ వద్ద ఉన్న క్యూలైన్ ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారు. దర్శనం అనంతరం మ్యారేజ్ రిసిప్ట్‌లో నమోదైన వ్యక్తుల సంఖ్యకు అనుగుణంగా ఉచితంగా లడ్డూలను లడ్డూ కౌంటర్ వద్ద పొందే అవకాశం కూడా ఉంటుంది.
తిరుమలలో ఉచిత వివాహాలు చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. ఈ ఆన్‌లైన్ సదుపాయం 2016 మే 9 నుంచి అమల్లో ఉంది. ఇందుకోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. వెబ్‌సైట్‌లోని కళ్యాణ వేదిక విభాగంలో వరుడు, వధువు వివరాలతో పాటు వారి తల్లిదండ్రుల సమాచారం, ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయాలి.
వయస్సు ధ్రువీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్, పదో తరగతి మార్కుల లిస్టు లేదా ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, లేదా పంచాయతీ కార్యదర్శి/మున్సిపల్ అధికారుల ద్వారా జారీ చేసిన వయస్సు ధ్రువీకరణ పత్రం నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. వివాహ తేదీ, ముహూర్త సమయాన్ని ఆన్‌లైన్‌లో ఎంపిక చేసి వివరాలను అప్‌లోడ్ చేసిన వెంటనే అక్నాలెడ్జ్‌మెంట్ పత్రం జారీ అవుతుంది.
ఈ అక్నాలెడ్జ్‌మెంట్ పత్రంతో వధూవరులు తమ తమ ప్రాంతాల ఎమ్మార్వో కార్యాలయంలో ఇదే మొదటి వివాహమని ధ్రువీకరణ పత్రం పొందాలి. వివాహ ముహూర్తానికి కనీసం ఆరు గంటల ముందు తిరుమల చేరుకుని, కళ్యాణ వేదిక కార్యాలయంలో ఎమ్మార్వో ధ్రువీకరణ పత్రం, వధూవరులు మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, వయస్సు ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులను సిబ్బందికి సమర్పించాలి. అనంతరం అక్కడి సిబ్బంది ద్వారా అన్ని వివరాలు మరోసారి పరిశీలించబడతాయి.
అవకాశాన్ని బట్టి, ఉచిత వివాహాలు చేసుకునే జంటలకు తిరుమలలో రూ.50 చెల్లింపుతో సీఆర్‌వో లేదా ఏఆర్‌పీ కార్యాలయం వద్ద గదిని కూడా కేటాయించే వెసులుబాటు ఉంది. అయితే, ఈ సదుపాయం అందుబాటును బట్టి మాత్రమే కల్పించబడుతుంది.
తిరుమల కళ్యాణ వేదికలో వివాహం చేసుకోవాలనుకునే వధూవరులు తప్పనిసరిగా హిందూ మతానికి చెందినవారై ఉండాలి. వధువుకు కనీసం 18 సంవత్సరాలు, వరునికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ద్వితీయ వివాహాలు, ప్రేమ వివాహాలకు ఇక్కడ అనుమతి ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.
ఇక వివాహం అనంతరం రిజిస్ట్రేషన్ సౌలభ్యం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ వివాహ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసింది. ఇందుకోసం వధూవరులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలు, వివాహ ఫోటోలు, పెళ్లి పత్రిక, కళ్యాణ వేదిక రసీదు, అలాగే అవివాహితులుగా ఉన్నట్లు స్థానిక ఎమ్మార్వో జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
ఇతర వివరాల కోసం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళ్యాణ వేదిక కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్ నంబర్ 0877–2263433 ద్వారా సంప్రదించవచ్చని టీటీడీ తెలిపింది.



