ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11 జిల్లా కోర్టుల్లో 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్, రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీల ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ చేపడుతున్నారు.
ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో ఓఎంఆర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి తుది ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
పదో తరగతి, ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకానికి సంబంధించిన ఆఫ్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ జనవరి 12వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జనవరి 27వ తేదీ వరకు దరఖాస్తు చేయాలి.
పోస్టుల వారీ అర్హతలు:
ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్:
కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ నైపుణ్యం ఉండాలి. ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్‌లో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.
రికార్డ్ అసిస్టెంట్:
ఎస్ఎస్‌సీ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్:
కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతతో పాటు ఎంఎస్ ఆఫీస్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం.
జీతభత్యాలు:
ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ పోస్టుకు నెల జీతం రూ.25,220 నుంచి రూ.80,910 వరకు ఉంటుంది.
రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.23,120 నుంచి రూ.74,770 వరకు జీతం ఉంటుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు రూ.28,280 నుంచి రూ.89,720 వరకు పే స్కేల్ నిర్ణయించారు.
దరఖాస్తు విధానం & ఫీజు:
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫారమ్‌ను సంబంధిత జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్‌ను పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్ల కాపీలతో పాటు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి. కవర్‌పై ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో స్పష్టంగా పేర్కొనాలి.
దరఖాస్తు ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు రూ.500గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి డీడీ తీసుకుని, సంబంధిత జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి పేరుతో పంపించాలి.
ముఖ్య గమనిక:
జిల్లాల వారీగా కోర్టుల అధికారిక వెబ్‌సైట్లలోని రిక్రూట్‌మెంట్ లేదా నోటిఫికేషన్ విభాగంలో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచే అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సంబంధిత జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.


