టీచర్ ఉద్యోగాలకు మరో అవకాశం.. ఏపీలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ సిద్ధం

త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీ ప్రక్రియ ఇప్పటికే పూర్తవగా, 15 వేల మందికిపైగా అభ్యర్థులకు నియామకపత్రాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం వారంతా విధుల్లో చేరి సేవలందిస్తున్నారు. అయితే ఆ ప్రక్రియలో కొన్ని పోస్టులు భర్తీ కాకపోవడంతో పాటు, తాజాగా రిటైర్మెంట్ల వల్ల ఏర్పడిన ఖాళీలను కూడా కలిపి మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

గతేడాది మెగా డీఎస్సీలో భాగంగా దాదాపు 400కుపైగా పోస్టులు మిగిలిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ఈ ఏడాది ఖాళీ అయ్యే పోస్టులను కూడా కలిపి కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ రూపొందించే పనిలో విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల నుంచి ఖాళీల వివరాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు వచ్చే వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ వ్యవహారాన్ని పూర్తి చేసి, ఖచ్చితమైన ఖాళీలపై స్పష్టతకు రావాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో పక్కా లెక్కలు తేలిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏపీ టెట్ ఫలితాలు విడుదల కావడంతో, అర్హత సాధించిన వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చేసిన ప్రకటన కూడా అభ్యర్థుల్లో ఆశలు పెంచింది.

అన్ని జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని సమీక్షించిన తర్వాత ఖాళీలపై స్పష్టతకు వచ్చి, నోటిఫికేషన్ జారీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయనుంది. ఒకవేళ రాబోయే రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడితే, మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అంచనా. మరోవైపు స్పెషల్ డీఎస్సీకి సంబంధించి 2,260 పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి లభించింది. ఈ పోస్టుల భర్తీపై కూడా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

రాబోయే డీఎస్సీ పరీక్షల విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌తో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలను కూడా నిర్వహించే యోచనలో ఉంది. ఇటీవల విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో చేర్పిస్తున్న పరిస్థితిలో, కొత్తగా నియమితులయ్యే టీచర్లకు కూడా ఆంగ్ల భాషపై మంచి పట్టు ఉండాలనే అభిప్రాయానికి విద్యాశాఖ వచ్చింది. అలాగే పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ప్రాథమిక కంప్యూటర్ అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో, డీఎస్సీలో భాగంగా కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షను ప్రవేశపెట్టే అవకాశముంది. దీనివల్ల ఇంగ్లీష్ మీడియం బోధనలో ఎదురయ్యే సమస్యలు తగ్గడమే కాకుండా, విద్యార్థులకు ఆధునిక విద్య అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశాలపై నోటిఫికేషన్‌లో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి