కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారడంతో, ఇరు వర్గాలు కత్తులతో పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త బంగారయ్య అక్కడికక్కడే మృతి చెందగా, అదే పార్టీకి చెందిన దుర్గా ప్రసాద్, శ్రీరామమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదే ఘర్షణలో వైసీపీ కార్యకర్తలు నారాయణమూర్తి, సతీశ్లకు కూడా తీవ్ర గాయాలు కావడంతో, వారిని కూడా వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, టీడీపీ కార్యకర్తలు ఒక పుట్టినరోజు వేడుకకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఎదురుపడటంతో మాటల తూటాలు పేలాయి. ఈ వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారి, చివరకు కత్తులతో దాడుల వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది. పాత రాజకీయ వైరం, గత గొడవలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే గ్రామంలో మరింత ఉద్రిక్తతలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా భారీగా పోలీసు బలగాలను మోహరించి పికెటింగ్ నిర్వహిస్తున్నారు. గ్రామంలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.



