ఇరాన్లో కొనసాగుతున్న తీవ్ర అల్లర్ల మధ్య అక్కడ చిక్కుకుపోయిన పలువురు భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. భారత విదేశాంగ శాఖ జారీ చేసిన సూచనల మేరకు శుక్రవారం రాత్రి వారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తమను సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, కరెన్సీ పతనం నేపథ్యంలో గత డిసెంబర్ చివరి నుంచి దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఈ అల్లర్ల కారణంగా భద్రతా పరిస్థితి తీవ్రంగా క్షీణించడంతో పాటు, పలుచోట్ల ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అక్కడ ఉన్న భారతీయుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ పరిస్థితుల దృష్ట్యా భారత విదేశాంగ శాఖతో పాటు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా వెంటనే దేశం విడిచి రావాలని అక్కడున్న భారత పౌరులకు సూచించింది. ఆ సూచనల మేరకు పలువురు స్వదేశానికి తిరిగివచ్చారు.
స్వదేశానికి చేరుకున్న ఒక భారతీయుడు మీడియాతో మాట్లాడుతూ, “ఇరాన్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయం మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశాయి. మోదీజీ నాయకత్వంలో మాకు భద్రత లభించింది” అని అన్నారు. మరో వ్యక్తి మాట్లాడుతూ, “ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోయాం. బయటకు వెళ్తే నిరసనకారులు అడ్డుకునే పరిస్థితి ఉండేది” అంటూ అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు.
విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఇరాన్లో విద్యార్థులు సహా సుమారు 9,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. వారి భద్రత, సంక్షేమమే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తూ, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాణిజ్య విమానాల ద్వారానే భారత పౌరుల స్వదేశీ ప్రయాణాన్ని సులభతరం చేస్తున్నట్లు వెల్లడించారు.



