మద్యం రెగ్యులర్‌గా తీసుకుంటే పిల్లలు పుట్టడం కష్టమా? నిజమెంత?

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసినదే. అయినా, మద్యం వినియోగం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. పండుగలు, వేడుకలు, ప్రత్యేక సందర్భాల పేరుతో మద్యం సేవించడం ఈ మధ్య కాలంలో మరింత పెరిగింది. ఒత్తిడి తగ్గించుకోవాలన్నా, పార్టీలు చేసుకోవాలన్నా చాలామంది మద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ అలవాటు దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఇటీవల సంతానోత్పత్తిపై మద్యపానం ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెగ్యులర్‌గా మద్యం తీసుకునే వారిలో సంతాన సమస్యలతో చికిత్స కోసం ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. మద్యపానంతో పాటు మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ముఖ్యంగా యువతలో లేట్ నైట్ పార్టీలకు అలవాటు పెరిగింది. అర్ధరాత్రి ప్రారంభమై తెల్లవారుజామున 2–3 గంటల వరకు కొనసాగే పార్టీలు మెదడుపై ఒత్తిడిని పెంచుతాయి. చాలామంది వీటిని ‘రిలాక్సేషన్’గా భావించినప్పటికీ, వాస్తవానికి ఇవి నెమ్మదిగా ప్రమాదకరమైన అలవాటుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన ఒక అధ్యయనం కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. రెగ్యులర్‌గా మద్యం తీసుకునే వారిలో సంతానోత్పత్తి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఈ పరిశోధన కోసం 400 మందికి పైగా వ్యక్తులను ఎంపిక చేసి, సుమారు 18 నెలల పాటు వారి దినచర్య, జీవనశైలి, మద్యపాన అలవాట్లను పరిశీలించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పరిమితంగా మద్యం తీసుకున్నప్పటికీ సంతాన సాఫల్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు తేలింది.

అయితే సంతాన సమస్యలు కేవలం మద్యపానంపై మాత్రమే ఆధారపడి ఉండవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యక్తుల సాధారణ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, శరీరంలో పోషకాహార స్థాయి, విటమిన్ లోపాలు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక అంశాలు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. అలాగే డయాబెటిస్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా పిల్లలు పుట్టడంలో అడ్డంకిగా మారే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

మొత్తానికి, మద్యం సేవనాన్ని అలవాటుగా మార్చుకోవడం ఆరోగ్యానికి మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు కూడా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంతానాన్ని కోరుకునే వారు మద్యపానానికి దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అత్యంత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి