Lalitha Jewellers MD Kiran Kumar: చెప్పులు లేని బాల్యం నుంచి కోటీశ్వరుడిగా ఎదిగిన ప్రేరణాత్మక కథ

సాధారణంగా పెద్ద సంస్థలు తమ బ్రాండ్ ప్రచారానికి సినీ స్టార్లు, సెలబ్రిటీలను ఆశ్రయిస్తుంటాయి. కానీ లలితా జ్యూవెలర్స్ ఎండీ డా. ఎం. కిరణ్ కుమార్ మాత్రం తన సంస్థకు తానే బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లలితా జ్యూవెలర్స్ యాడ్స్‌తో దేశవ్యాప్తంగా పరిచయమైన ఆయన, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని కష్టాలను, విజయ ప్రయాణాన్ని ఆసక్తికరంగా పంచుకున్నారు.

తన చిన్ననాటి జీవితం తీవ్ర ఆర్థిక కష్టాలతో నిండి ఉందని కిరణ్ కుమార్ వెల్లడించారు. తన తండ్రి జీవితాంతం చెప్పులు కూడా వేసుకోలేదని, ఇంట్లో భోజనం చేసేందుకు డబ్బులు లేని రోజులు ఎన్నో ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆకలి విలువ, డబ్బు ప్రాముఖ్యతను దగ్గరగా చూశానని తెలిపారు. తల్లిదండ్రులు తిండి గురించి ఆందోళనగా మాట్లాడుకునే మాటలు తన మనసుపై గాఢమైన ప్రభావం చూపాయని చెప్పారు.

అలాంటి పరిస్థితుల మధ్యనే 14 ఏళ్ల వయసులో వ్యాపారంలోకి అడుగుపెట్టానని కిరణ్ కుమార్ తెలిపారు. తన వ్యాపార ప్రయాణం కేవలం 65 గ్రాముల బంగారంతో ప్రారంభమైందని చెప్పారు. తల్లి గాజులను కుదవ పెట్టకుండా, వాటిని కరిగించి ఆ బంగారంతోనే హోల్‌సేల్ జ్యూవెలరీ వ్యాపారం మొదలుపెట్టానని వివరించారు. ఆ కష్టసమయంలో తీసుకున్న ఆ నిర్ణయమే తన జీవితాన్ని మలుపుతిప్పిందని అన్నారు.

అతి చిన్న వయసులోనే అహర్నిశలు శ్రమించి, 19 ఏళ్లకే కోటీశ్వరుడిగా ఎదిగినట్లు కిరణ్ కుమార్ వెల్లడించారు. తన బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలే తన విజయానికి బలమైన పునాదిగా మారాయని స్పష్టం చేశారు. డబ్బు, ఆకలినే తన గురువులుగా భావిస్తానని, డబ్బు లేనప్పుడే దాని విలువ, ఆకలితో ఉన్నప్పుడే ఆహారం విలువ తెలుస్తుందని ఆయన అన్నారు.

డబ్బు ఉన్నవారు దాన్ని తేలికగా తీసుకుంటారని, కానీ డబ్బును గౌరవించని వారికి జీవితం కఠినంగా మారుతుందని వ్యాఖ్యానించారు. సమాజంలో కూడా డబ్బు ఉన్నవారినే ఎక్కువగా గౌరవిస్తారని, ఇది నేటి వాస్తవ పరిస్థితి అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రతిరోజూ కేవలం 4 నుంచి 5 గంటలే నిద్రపోతూ, మిగిలిన సమయాన్ని పూర్తిగా పనికే కేటాయిస్తానని తెలిపారు.

తన గతాన్ని, తాను ఎదుర్కొన్న కష్టాలను ఎప్పటికీ మర్చిపోకుండా ముందుకు సాగడమే తన విజయ రహస్యమని కిరణ్ కుమార్ చెప్పారు. చెప్పులు లేని బాల్యం నుంచి వేల కోట్ల జ్యూవెలరీ వ్యాపారానికి అధినేతగా ఎదిగిన ఆయన ప్రయాణం నేటి యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి