సంక్రాంతి పండుగను సొంతూళ్లలో ఆనందంగా జరుపుకున్న నగరవాసులు తిరిగి హైదరాబాద్‌కు చేరుకునేందుకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 65)పై ఏర్పడే భారీ ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ మళ్లింపు నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దేశంలోనే అత్యధిక వాహన రద్దీ ఉండే హైవేలలో హైదరాబాద్–విజయవాడ రహదారి ఒకటి. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మూడు రోజుల వ్యవధిలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు సుమారు మూడు లక్షల వాహనాలు వెళ్లినట్లు అంచనా. పండుగ ముగియడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకేసారి వాహనాలు హైదరాబాద్ దిశగా రావడంతో ఎన్‌హెచ్ 65పై తీవ్ర రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే కొన్ని బ్లాక్ స్పాట్స్ వద్ద ఫ్లైఓవర్‌లు, బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో ట్రాఫిక్ జామ్ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అద్దంకి–నార్కెట్‌పల్లి రహదారి నుంచి వచ్చే వాహనాలు నార్కట్‌పల్లి వద్ద ఎన్‌హెచ్ 65లో కలవడం వల్ల అక్కడ తీవ్ర రద్దీ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని పోలీసులు సూచిస్తున్నారు.
గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు
గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ → హైదరాబాద్
మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు
మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ → హైదరాబాద్
నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు
నల్లగొండ → మర్రిగూడ బైపాస్ → మునుగోడు → నారాయణపూర్ → చౌటుప్పల్ (ఎన్‌హెచ్ 65) → హైదరాబాద్
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలకు
కోదాడ → హుజూర్‌నగర్ → మిర్యాలగూడ → హాలియా → చింతపల్లి → మాల్ → హైదరాబాద్
అలాగే ఎన్‌హెచ్ 65పై చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణాల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడితే, చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్‌కు వాహనాలను మళ్లిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ప్రత్యామ్నాయ మార్గాల వినియోగంతో ప్రధాన హైవేపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ప్రయాణికులు గమ్యస్థానాలకు వేగంగా చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
తిరుగు ప్రయాణంలో ఉన్న నగరవాసులు సురక్షితంగా హైదరాబాద్ చేరుకోవడమే లక్ష్యంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టామని సూర్యాపేట, నల్లగొండ జిల్లాల ఎస్పీలు వెల్లడించారు. హైవేపై ట్రాఫిక్ పరిస్థితిని డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘా ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు సమాచారం ఇవ్వాలని, వాహనదారులు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.



