Biological Reality పేరుతో రాజకీయ దాడి?
సోషల్ మీడియాలో వైరల్ అయిన సంభాషణ
అమెరికా సెనెట్‌లో అబార్షన్ మాత్రల భద్రతపై జరిగిన కీలక విచారణ అనూహ్యంగా ‘జెండర్’ అంశంపై తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. ఈ విచారణలో భారత సంతతి గైనకాలజిస్ట్ డాక్టర్ నిషా వర్మను రిపబ్లికన్ సెనేటర్ జోష్ హాలీ పదే పదే “పురుషులు గర్భం దాల్చగలరా?” అని ప్రశ్నించడం తీవ్ర వివాదానికి కారణమైంది. ఈ సంభాషణ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
అబార్షన్‌కు ఉపయోగించే మైఫెప్రిస్టోన్ (Mifepristone) మాత్రల భద్రతపై సెనేట్ కమిటీ ముందు డాక్టర్ నిషా వర్మ సాక్ష్యం ఇస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె “గర్భం దాల్చిన వ్యక్తులు” (Pregnant People) అనే పదాన్ని ఉపయోగించారు.
దీనిపై వెంటనే స్పందించిన సెనేటర్ జోష్ హాలీ –
“మీరు ‘వ్యక్తులు’ అంటున్నారు. అంటే పురుషులు కూడా గర్భం దాల్చగలరని మీరు నమ్ముతున్నారా?” అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు డాక్టర్ నిషా వర్మ సంయమనంతో స్పందిస్తూ,
“నేను విభిన్న గుర్తింపులు కలిగిన రోగులకు చికిత్స అందించే వైద్యురాలిని. మీరు ఈ ప్రశ్నను ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో నాకు స్పష్టంగా లేదు” అని సమాధానమిచ్చారు.
సైన్స్ వర్సెస్ రాజకీయాలు
అయితే సెనేటర్ హాలీ ఈ అంశాన్ని ఇక్కడితో వదలకుండా,
“ఇది రాజకీయ ప్రశ్న కాదు. ఇది బయోలాజికల్ రియాలిటీ. అవునా కాదా అని మాత్రమే చెప్పండి” అంటూ పట్టుబట్టారు.
దీనికి డాక్టర్ నిషా వర్మ ఘాటుగా కానీ హుందాగా స్పందిస్తూ,
“ఇలాంటి అవును లేదా కాదు అనే ప్రశ్నలు వైద్య శాస్త్రంలోని సంక్లిష్టతను విస్మరిస్తాయి. ఇవి రాజకీయ ఆయుధాలుగా మారుతున్నాయి” అని వ్యాఖ్యానించారు.
అయితే హాలీ మాత్రం,
“పురుషులు గర్భం దాల్చలేరనే కనీస జీవశాస్త్ర వాస్తవాన్ని అంగీకరించని వ్యక్తి సాక్ష్యాన్ని మేం ఎలా నమ్మాలి?” అంటూ విమర్శలు గుప్పించారు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ సంభాషణ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు దీనిని శాస్త్రంపై రాజకీయ దాడిగా అభివర్ణిస్తే, మరికొందరు ‘బయోలాజికల్ ట్రూత్’ పేరుతో సెనేటర్ ప్రశ్నలను సమర్థించారు. ఈ అంశంపై అమెరికాలో జెండర్, వైద్య నైతికత, రాజకీయాలు మళ్లీ కేంద్రబిందువయ్యాయి.
ఎవరు డాక్టర్ నిషా వర్మ?
డాక్టర్ నిషా వర్మ నార్త్ కరోలినాలో భారత వలస దంపతులకు జన్మించారు. ఆమె ప్రసూతి, గైనకాలజీ రంగంలో ప్రముఖ వైద్య నిపుణురాలు.
ప్రస్తుతం ఆమె
- Physicians for Reproductive Health సంస్థలో ఫెలోగా
- American College of Obstetricians and Gynecologists (ACOG) లో సీనియర్ సలహాదారుగా
- Emory University School of Medicine లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
అబార్షన్ మందుల భద్రతపై తన నమ్మకాన్ని వివరించేందుకు, ఇటీవల తానూ గర్భస్రావం అనంతరం అదే మందులు వాడిన విషయాన్ని కమిటీ ముందు వెల్లడించారు.
ప్రముఖుల స్పందన
ఈ వివాదంపై టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు.
“ఇంత ప్రాథమిక అంశాలు కూడా రాజకీయ చర్చలుగా మారడం బాధాకరం” అంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి.



