ఆకాశ ప్రేమికులకు అరుదైన అవకాశం రాబోతోంది. గురు గ్రహం (బృహస్పతి) ఈ రోజుల్లో ఆకాశంలో అత్యంత అద్భుతంగా దర్శనమివ్వనుంది. భూమికి పూర్తిగా వ్యతిరేక దిశలోకి రావడంతో, రాత్రి నుంచి తెల్లవారు జామున వరకు తూర్పు దిక్కున మిథున రాశి కూటమిలో అసాధారణమైన ప్రకాశంతో మెరిసిపోతుంది. గురు గ్రహాన్ని వీక్షించేందుకు ఇదే ఉత్తమ సమయమని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గ్రహాల దర్శనం వాటి కక్ష్య స్థానాలపై ఆధారపడి ఉంటుంది. భూమి కక్ష్యకు బయటగా, సూర్యుడికి దూరంగా తిరిగే గ్రహాలను ‘సుపీరియర్ ప్లానెట్స్’గా పిలుస్తారు. ఇవి భూమికి పూర్తి వ్యతిరేక దిశలోకి (Opposition) వచ్చినప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సమయంలో భూమి సరిగ్గా సూర్యుడు – గురు గ్రహం మధ్యలో ఉంటుంది.
ఈ వ్యతిరేక స్థితిలో గురు గ్రహం భూమికి అత్యంత సమీపంగా చేరుతుంది. సాధారణంగా దీని ఆర్బిటల్ పరిమాణం 31.3 ఆర్క్సెకండ్లు మాత్రమే ఉండగా, ఈ సమయంలో అది 45.6 ఆర్క్సెకండ్ల వరకు పెరుగుతుంది. అందువల్ల సాధారణం కంటే పెద్దదిగా, ఎక్కువ ప్రకాశంతో కనిపిస్తుంది. కంటితోనే అద్భుతంగా దర్శనమిస్తూనే, టెలిస్కోప్ ద్వారా చూస్తే మరింత స్పష్టతతో వీక్షించవచ్చు.
సూర్యాస్తమయం అనంతరం తూర్పు దిక్కున దృష్టి సారిస్తే మిథున రాశి కూటమిలో గురు గ్రహం మెరిసిపోతూ కనిపిస్తుంది. దాని కుడివైపున ఓరియన్ నక్షత్రరాశి, పైభాగంలో ప్రకాశవంతమైన కాపెల్లా నక్షత్రం దర్శనమిస్తాయి. ఈ భారీ వాయు గ్రహం రాత్రి సమయంలో ఆకాశంలో గరిష్ట ఎత్తుకు చేరుకుంటుంది. 11వ తేదీ తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు పశ్చిమ దిక్కున క్రమంగా దిగువకు చేరుకుంటుంది.
ఎటువంటి పరికరాలు లేకుండా నేరుగా చూసినా గురు గ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 152 మిల్లీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ అపెర్చర్ ఉన్న టెలిస్కోప్ ఉపయోగిస్తే, గ్రహం ఉపరితలంపై ఉన్న రంగురంగుల వాతావరణ మేఘాల పొరలు అత్యంత ఆకట్టుకునేలా దర్శనమిస్తాయి.
ఈ సమయంలో గురు గ్రహానికి ఇరువైపులా ఒకే సరళ రేఖలో దాని నాలుగు ప్రసిద్ధ గెలీలియన్ ఉపగ్రహాలు — ఐఓ, యూరోపా, గెనిమీడ్, కాల్లిస్టో — కూడా స్పష్టంగా కనిపించనున్నాయి. ఈ అద్భుత ఖగోళ దృశ్యాన్ని రాత్రంతా ఆస్వాదించవచ్చు. చంద్రుడు, శుక్రుడితో పాటు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించే గ్రహంగా గురు గ్రహం నిలుస్తుంది.
ఇదే కాకుండా, ఈ నెల 23వ తేదీన చంద్రుడు – శని గ్రహాల కంజంక్షన్ ఏర్పడనుంది. అంటే ఈ రెండు ఖగోళ వస్తువులు ఆకాశంలో చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి. 23వ తేదీ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ దిక్కున ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు. చంద్రుడికి దిగువన శని గ్రహం మెరిసిపోతూ కనిపిస్తుంది.
ఈ నెలంతా రాత్రి ఆకాశంలో ‘బీహైవ్ క్లస్టర్’ కూడా స్పష్టంగా దర్శనమిస్తుంది. దీనినే ఖగోళ శాస్త్రంలో మెస్సియర్ 44 (M44)గా పిలుస్తారు. నక్షత్రాలతో కూడిన ఈ ఓపెన్ స్టార్ క్లస్టర్ ఆకాశ పరిశీలనకు మరింత ఆసక్తిని కలిగిస్తుంది.



