ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరిట భారీ మోసం – బీహార్‌లో ఇద్దరి అరెస్టు

పిల్లలు కలగక బాధపడుతున్న మహిళలను ఆసరాగా చేసుకుని, భావోద్వేగాలను అడ్డుపెట్టుకుని దారుణ మోసానికి పాల్పడ్డారు ఇద్దరు కేటుగాళ్లు. మహిళలను తల్లి చేయగలిగితే రూ.10 లక్షలు ఇస్తామని ఆన్‌లైన్‌లో ప్రకటనలు పెట్టి, ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్’ అనే పేరుతో దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసిన ఘటన బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ మోసంలో ఒకరు మైనర్ కావడం మరింత కలకలం రేపుతోంది.

ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి ఫోన్ చేసిన వారికి మాయమాటలు చెప్పి, రిజిస్ట్రేషన్ ఫీజు, హోటల్ ఖర్చులు అంటూ దశలవారీగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. మోసపోయామని తెలిసినా పరువు పోతుందనే భయంతో కొందరు మౌనం పాటించగా, మరికొందరు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.


మహిళలను ప్రెగ్నెంట్ చేయాలంటూ ఆన్‌లైన్‌లో గాలం

పిల్లలు కలగక మానసిక వేదనకు గురవుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని నిందితులు ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రకటనలు విడుదల చేశారు. ఆకర్షణీయమైన మోడళ్ల ఫోటోలతో ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్’ పేరిట ప్రచారం సాగిస్తూ, తాము దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నామని, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా తమ ‘జాబ్’కు అర్హులేనని ప్రచారం చేశారు.

ఈ ప్రకటన చూసి ఫోన్ చేసిన వారికి, తాము సూచించిన మహిళను ప్రెగ్నెంట్ చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని, ఆ ప్రయత్నం విఫలమైతే కనీసం ఐదు లక్షలు చెల్లిస్తామని ప్రలోభపెట్టారు. ఇందుకోసం ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, దానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.


ఫీజుల పేరుతో లక్షల్లో దండకం

పది లక్షల ఆశతో కొందరు, డబ్బుల సంగతి పక్కనపెట్టి సుఖం దక్కుతుందనే భావనతో మరికొందరు ఈ మోసగాళ్ల వలలో పడ్డారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన అనంతరం, హోటల్ టారిఫ్ అంటూ మరోసారి డబ్బులు అడిగారు. ఆ తర్వాత మెడికల్ ఖర్చులు, ప్రొటెక్షన్ ఛార్జీలు అంటూ ఒక్కో పేరుతో ఒక్కో ఫీజు వసూలు చేస్తూ పోయారు.

ఒక ఫీజు చెల్లించగానే మరో కారణం చూపించి మరొక ఫీజు అడగడం వీరి పద్ధతిగా మారింది. చివరకు ఫలితం కనిపించకపోవడంతో, మోసపోయామని బాధితులు గ్రహించారు. అప్పటికే లక్షల రూపాయలు గాలిలో కలిసిపోయాయి.


పోలీసుల దర్యాప్తు – నిందితుల అరెస్టు

బాధితుల ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్ లావాదేవీలు, కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసులో ఒకరు మైనర్ కావడంతో, చట్టపరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఇటువంటి ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి