KCR Help: తండ్రులను కోల్పోయిన బీటెక్ విద్యార్థులకు కేసీఆర్ ఆర్థిక సాయం

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆయన అండగా నిలిచారు. వారి బీటెక్ పూర్తి చదువుకు సంబంధించిన కాలేజ్ ఫీజులు చెల్లించడంతో పాటు, ఇతర అవసరాల కోసం కూడా ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించారు.

ఎర్రవెల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు

గజ్వేల్ నియోజకవర్గంలోని కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లికి చెందిన రైతు చిన్రాజు సత్తయ్య ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుమారుడు నవీన్ ప్రస్తుతం స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు.
అలాగే అదే గ్రామానికి చెందిన మరో రైతు పెద్దోళ్ల సాయిలు కొన్ని సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తూ మరణించారు. ఆయన కుమారుడు అజయ్ కూడా బీటెక్ విద్యార్థే.

ఫీజులు చెల్లించలేని పరిస్థితి

తండ్రులు లేకపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించి, కాలేజ్ ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఎర్రవెల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. సమాచారం అందగానే ఆయన వెంటనే స్పందించారు.

పూర్తి ఫీజులకు చెక్కులు అందజేత

విద్యార్థులను దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పిన కేసీఆర్, వారి ఇంజినీరింగ్ చదువు పూర్తయ్యే వరకు అవసరమైన ఫీజులకు సరిపడే చెక్కులను అందజేశారు. చదువులో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగాలని సూచించారు.

“డబ్బుల సమస్య వస్తే నేరుగా చెప్పండి”

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ,
“కష్టపడి మంచిగా చదవండి. మంచి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. ఏదైనా డబ్బుల సమస్య వస్తే నేరుగా నా దృష్టికి తీసుకురండి”
అని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తమకు అండగా ఉంటుందని తెలిపారు.

బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆదేశాలు

విద్యుత్ ప్రమాదంలో మరణించిన చిన్రాజు సత్తయ్య కుటుంబానికి సంబంధించి విద్యుత్ శాఖ నుంచి చట్టపరంగా అందాల్సిన ఆర్థిక సాయం పూర్తిగా అందేలా పర్యవేక్షించాలని తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్ రెడ్డికి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు

కుటుంబ పెద్దను కోల్పోయిన తమను గుర్తించి, ఆదరించి, పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆలోచించినందుకు కేసీఆర్‌కు విద్యార్థుల తల్లులు చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఆర్థిక సాయం తమ జీవితాల్లో ఆశా కిరణంలా నిలిచిందని విద్యార్థులు, కుటుంబ సభ్యులు భావోద్వేగంగా చెప్పారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి