అమెజాన్ పేలో కొత్త ఫీచర్.. యాప్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 8% వరకు వడ్డీ

ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు చెందిన డిజిటల్ పేమెంట్స్ విభాగం అమెజాన్ పే తన వినియోగదారుల కోసం మరో కీలక ఆర్థిక సేవను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై అమెజాన్ పే యాప్ ద్వారానే ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ డిపాజిట్లపై వార్షికంగా 8 శాతం వరకు వడ్డీ లభించనుంది.

ఈ సేవను అమలు చేయడానికి అమెజాన్ పే శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులు కేవలం రూ.1,000 కనీస పెట్టుబడితోనే ఎఫ్‌డీ ప్రారంభించవచ్చు. అదనంగా, ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేకుండా, పూర్తిగా డిజిటల్ విధానంలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

అమెజాన్ పే యాప్‌లో వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను పోల్చి చూసుకుని, తమకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకునే సౌలభ్యం కల్పించారు. ఈ సేవను ఉపయోగించేందుకు ప్రత్యేకంగా సేవింగ్స్ ఖాతా తెరవాల్సిన అవసరం కూడా లేదు.

శ్రీరామ్ ఫైనాన్స్‌లో పెట్టుబడి పెట్టే మహిళా ఇన్వెస్టర్లకు అదనంగా 0.5 శాతం వడ్డీ లభించనుండగా, సీనియర్ సిటిజన్లకు అన్ని భాగస్వామ్య సంస్థల నుంచీ అదనపు వడ్డీ ప్రయోజనం ఉంటుంది. బ్యాంకుల్లో చేసే ఎఫ్‌డీలకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుందని అమెజాన్ పే స్పష్టం చేసింది.

భారత్‌లో ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పెట్టుబడులకు మంచి డిమాండ్ ఉందని, ఈ కొత్త సేవ ద్వారా వినియోగదారులకు మెరుగైన రాబడులు, విస్తృత ఎంపికలు అందించాలన్నదే తమ లక్ష్యమని అమెజాన్ పే సీఈఓ వికాస్ బన్సాల్ తెలిపారు. ఇప్పటికే యూపీఐ చెల్లింపులు, బిల్ పేమెంట్స్ వంటి సేవలను అందిస్తున్న అమెజాన్ పే, ఇప్పుడు పెట్టుబడి సేవలను కూడా జోడించి తన ఫైనాన్షియల్ సర్వీసుల పరిధిని మరింత విస్తరిస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి