సంక్రాంతి 2026: తెలుగు సినిమాల్లో గ్లామర్ వార్ | ప్రభాస్, చిరుంజీవి, రవితేజ చిత్రాల హీరోయిన్ హైలైట్స్

తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి అంటే పండుగ సంబరాలతో పాటు థియేటర్ల దగ్గర కనిపించే భారీ సినిమాల సందడి. ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ పూర్తిగా ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. హీరోల మధ్య పోటీ ఎలా ఉంటుందో తెలిసిందే… కానీ ఈసారి ఆ పోటీకి ఏమాత్రం తగ్గకుండా హీరోయిన్ల మధ్య కూడా గ్లామర్ వార్ హాట్ టాపిక్‌గా మారింది. నిజంగా చెప్పాలంటే, ఈ సంక్రాంతి వెండితెరపై ‘అందాల జాతర’ జరగబోతోంది. ప్రభాస్ నుంచి శర్వానంద్ వరకూ స్టార్ హీరోలు రంగంలో ఉంటే, వారికి జోడీగా నటిస్తున్న అందాల భామల జాబితా ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సంక్రాంతికి థియేటర్లలో మెరవబోతున్న ఆ మహాలక్ష్మిలెవరో ఇప్పుడు చూద్దాం.

‘రాజా సాబ్’తో ముగ్గురు భామల గ్లామర్ ట్రీట్…
జనవరి 9న విడుదల కానున్న ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాతో సంక్రాంతి సంబరాలు మొదలవుతున్నాయి. ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ అనే ముగ్గురు అందాల భామలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. గ్లామర్ పరంగానూ, కెరీర్ పరంగానూ ఈ ముగ్గురికీ ఇది చాలా కీలకమైన సినిమా. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, కొత్త షేడ్స్‌లో కనిపించడం వల్ల వీరి పాత్రలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులకు ఈ ముగ్గురు కలిసి ఒక స్టైలిష్ విజువల్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

చిరు–వెంకీ సినిమాలో నయన్, కేథరిన్ హంగామా…
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ కూడా ఈ సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. సాధారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయన్, ఈ సినిమా కోసం మొదటి నుంచే యాక్టివ్‌గా పాల్గొనడం విశేషంగా మారింది. ఆమెతో పాటు కేథరిన్ థ్రెసా కూడా ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇద్దరు భామలు తమ గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్‌తో కూడా సినిమాకు అదనపు బలంగా మారనున్నారనే టాక్ వినిపిస్తోంది.

రవితేజ సినిమాకు మాస్ గ్లామర్… డింపుల్, ఆషికా
మాస్ మహారాజా రవితేజ సినిమాకు మాస్ టచ్‌కు తగ్గ గ్లామర్ అందించేందుకు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ సిద్ధమయ్యారు. ఈ సినిమాలో డింపుల్ హయాతి కొంత ఫ్యామిలీ లుక్‌లో కనిపిస్తుండగా, ఆషికా రంగనాథ్ మాత్రం తన గ్లామర్ షోతో యువతను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. రవితేజ ఎనర్జీకి వీరి గ్లామర్ జోడైతే థియేటర్లలో సందడి ఖాయం అన్న అంచనాలు ఉన్నాయి.

డబ్బింగ్ చిత్రాల ద్వారా పూజా, శ్రీలీల పోటీ…
డైరెక్ట్ తెలుగు సినిమాలే కాదు, డబ్బింగ్ చిత్రాల ద్వారా కూడా ఇతర భాషల స్టార్ హీరోయిన్లు సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. ‘జననాయగన్’, ‘పరాశక్తి’ వంటి చిత్రాలతో పూజా హెగ్డే, శ్రీలీల, మమితా బైజు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా పూజా హెగ్డే, శ్రీలీల వంటి స్టార్ భామలు పండుగ రేసులో ఉండటంతో గ్లామర్ కాంపిటీషన్ మరింత హీట్ పెంచుతోంది.

ఈసారి సంక్రాంతికి ఇంతమంది అందాల ‘మహాలక్ష్మి’లు వెండితెరపై సందడి చేయబోతుండటంతో, బాక్సాఫీస్ వద్ద సిరిమాలక్ష్మి అనుగ్రహం చివరికి ఏ భామకు దక్కుతుందో చూడాలి. ప్రేక్షకులకు మాత్రం ఈ పండుగ పూర్తిస్థాయి విజువల్ ఫీస్ట్ అందించనుందని చెప్పడంలో సందేహం లేదు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి