కోనసీమలో మరో బ్లోఅవుట్: ఇరుసుమండలో ONGC గ్యాస్ లీక్, పాశర్లపూడి ఘటన జ్ఞాపకాలు

ఏపీలోని కోనసీమ ప్రాంతాన్ని మరోసారి బ్లోఅవుట్ ఘటన భయభ్రాంతులకు గురిచేసింది. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామ సమీపంలో ఉన్న ఓఎన్‌జీసీ (ONGC) పైపులైన్ నుంచి సోమవారం భారీగా గ్యాస్ లీక్ అయింది. లీకైన గ్యాస్‌కు మంటలు అంటుకోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం నెలకొంది. ఈ ఘటనతో గతంలో పాశర్లపూడిలో చోటు చేసుకున్న భయంకరమైన బ్లోఅవుట్ జ్ఞాపకాలు స్థానికుల మనసుల్లో మళ్లీ కదిలాయి. కోనసీమలో ఎక్కడైనా గ్యాస్ లీక్ లేదా బ్లోఅవుట్ వార్త వస్తే, ప్రజలు ఇప్పటికీ ఆ దారుణ ఘటనను గుర్తుచేసుకుని ఆందోళన చెందుతున్నారు.

30 ఏళ్ల క్రితం పాశర్లపూడి బ్లోఅవుట్…
1995 జనవరి 8న తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడిలో ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ సమయంలో జరిగిన బ్లోఅవుట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారీగా గ్యాస్ లీక్ అయి అగ్నిప్రమాదంగా మారిన ఈ ఘటన ఏకంగా 65 రోజుల పాటు కొనసాగింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లోఅవుట్‌గా నమోదు కావడం విశేషం. ఈ ప్రమాదంలో డ్రిల్లింగ్ రిగ్ పూర్తిగా ధ్వంసమవగా, కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. అంతర్జాతీయ నిపుణుల సహకారంతోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలిగారు. ఈ ఘటన స్థానికుల జీవితాల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు కోనసీమలో మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ప్రజల్లో భయం మరింత పెరుగుతోంది.

సోమవారం మరో బ్లోఅవుట్…
సోమవారం మధ్యాహ్నం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద గ్యాస్ లీక్ ప్రారంభమైంది. దాదాపు రెండు గంటలపాటు నిరంతరంగా గ్యాస్ బయటకు రావడంతో అగ్నికీలలు చెలరేగాయి. లీకైన గ్యాస్ గాల్లో వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో ఉక్కిరిబిక్కిరి పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ లీక్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాజమండ్రి నుంచి ఓఎన్‌జీసీ నిపుణుల ప్రత్యేక బృందాన్ని రప్పిస్తున్నట్లు సమాచారం. అయితే కోనసీమ ప్రాంతంలో తరచుగా గ్యాస్ లీక్ ఘటనలు జరుగుతుండటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడంలో ఓఎన్‌జీసీ విఫలమవుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రస్తుత గ్యాస్ లీక్ వెనుక కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఉత్పత్తిలో ఉన్న ఒక బావి అకస్మాత్తుగా ఆగిపోవడంతో వర్క్ ఓవర్ రిగ్ ద్వారా పనులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీగా క్రూడ్‌తో కూడిన గ్యాస్ ఎగజిమ్మినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీంతో గ్రామంలోకి మంచు పొగల మాదిరిగా గ్యాస్, పొగ చొచ్చుకొచ్చింది. అప్రమత్తమైన అధికారులు పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ, గత అనుభవాల దృష్ట్యా స్థానికుల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి