అమరావతి అభివృద్ధితో విజయవాడ–గుంటూరులో రియల్ ఎస్టేట్ బూమ్ | కొత్త అపార్ట్‌మెంట్ ప్రాజెక్టుల హడావుడి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రాజధాని అమరావతిపై ప్రత్యేక దృష్టి సారించింది. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో అమరావతి ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. రాజధాని అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో అక్కడి భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొంది. ఒకప్పుడు వేగంగా సాగిన నిర్మాణాలు అర్థాంతరంగా ఆగిపోవడం, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలడం వల్ల పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు భారీ నష్టాలను చవిచూశారు.

విజయవాడ–గుంటూరు ప్రాంతంలో మళ్లీ రియల్ ఎస్టేట్ బూమ్

ఇప్పుడైతే పరిస్థితి మారుతోంది. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతిలో అభివృద్ధి పనులకు మళ్లీ ఊపొచ్చింది. రాజధాని నిర్మాణాల పునరుద్ధరణ, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడంతో విజయవాడ–గుంటూరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ చైతన్యాన్ని పొందుతోంది. విజయవాడ–గుంటూరు జాతీయ రహదారి పరిధి ఇప్పుడు రియల్ వ్యాపారానికి కేంద్రబిందువుగా మారుతోంది. 2014 తర్వాత టీడీపీ పాలన సమయంలో కనిపించిన ఉత్సాహం మళ్లీ ఈ రోజుల్లో స్పష్టంగా దర్శనమిస్తోంది.

వారం రోజుల్లోనే 20కి పైగా కొత్త అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులు

గత వారం రోజుల వ్యవధిలోనే ఈ కారిడార్‌లో దాదాపు 20కిపైగా కొత్త అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులకు భూమిపూజలు జరగడం విశేషం. ఇది ఈ ప్రాంతం భవిష్యత్‌పై పెరుగుతున్న నమ్మకానికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. రాజధాని పనులు తిరిగి ప్రారంభం కావడం, రహదారులు, డ్రైనేజ్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం వేగం పెంచడంతో అమరావతి పరిసరాలపై ప్రజల దృష్టి మళ్లీ కేంద్రీకృతమవుతోంది. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ ప్రాంతాల వైపు ఆసక్తి చూపుతున్నారు.

పెరిగిన నిర్మాణాల జోరు

ప్రత్యేకించి కాజా, మంగళగిరి, పెదకాకాని తదితర పరిసరాల్లో నిర్మాణాల హడావుడి గణనీయంగా పెరిగింది. ఇక్కడ సాధారణ అపార్ట్‌మెంట్లకే కాదు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లకు కూడా డిమాండ్ వేగంగా పెరుగుతోంది. హైవేకు ఇరువైపులా సర్వీస్ రోడ్ల విస్తరణ, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులు వేగం పుంజుకోవడంతో ఈ ప్రాంతాలు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి.

ఇన్వెస్టర్ల పోటీ అందుకే

దాదాపు ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుని, కొనుగోలుదారుల సందడితో కళకళలాడుతోంది. నివాస ప్రాజెక్టులతో పాటు కమర్షియల్ స్పేస్‌కూ ఇక్కడ మంచి గిరాకీ ఏర్పడింది. మల్టీప్లెక్స్‌లు, కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రముఖ బ్రాండెడ్ షోరూమ్‌లు ఈ హైవే వెంట ఏర్పాటు చేయడానికి పెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. భూముల ధరలు ఇప్పటికే పెరిగినా, భవిష్యత్‌లో ఈ ప్రాంతం ఒక భారీ మెట్రో సిటీగా రూపుదిద్దుకుంటుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు పోటీ పడి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి