మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నిజమైన పండుగ వాతావరణాన్ని తీసుకొస్తోంది ఆయన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు.
ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే… విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించడం. చిరంజీవి – వెంకటేశ్ తొలిసారి వెండితెరపై కలిసి కనిపించనున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ తెలుగు సినీ చరిత్రలో ఓ ప్రత్యేకమైన మైలురాయిగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇందులో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి, చిరంజీవి కామెడీ టైమింగ్‌ను కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా ఈ సినిమాను పూర్తిస్థాయి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించగా, పాటలు ఇప్పటికే మంచి స్పందనను రాబడుతున్నాయి.
ప్రమోషన్లలో భాగంగా జనవరి 7న భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్లో సినిమాపై ఉన్న క్రేజ్‌ను చాటుతూ ఇప్పటికే యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ట్రైలర్ రిలీజ్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.



