గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE)–2026 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువహటి కీలక అప్డేట్ విడుదల చేసింది. గేట్ 2026 అడ్మిట్ కార్డులను శుక్రవారం, జనవరి 2న విడుదల చేయనున్నట్లు ఐఐటీ గువహటి అధికారికంగా ప్రకటించింది. పరీక్షకు అప్లై చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ లాగిన్ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా, గేట్ 2026 పరీక్షలకు సంబంధించి పేపర్ల వారీగా పూర్తి షెడ్యూల్‌ను ఇప్పటికే ఐఐటీ గువహటి ప్రకటించింది. ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో ఆయా సబ్జెక్టులకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నాలుగు రోజుల్లో ప్రతిరోజూ రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్‌ను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్న సెషన్‌ను 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం గేట్ పరీక్షను ప్రతి ఏడాది నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 30 పేపర్లలో ఈ పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (ఆన్లైన్) విధానంలో నిర్వహిస్తారు. బీటెక్ విద్యార్థులతో పాటు బీఎస్సీ, బీఏ, బీకాం పూర్తి చేసిన అభ్యర్థులు కూడా గేట్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది.
గేట్ పరీక్షలో సాధించిన స్కోర్‌కు ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి వరుసగా మూడేళ్ల పాటు చెల్లుబాటు ఉంటుంది. ఈ స్కోర్ ఆధారంగా మూడేళ్ల కాలంలో ఎంటెక్, పీహెచ్డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అభ్యర్థులు గరిష్ఠంగా రెండు పేపర్ల వరకు గేట్ పరీక్ష రాయడానికి అనుమతి ఉంటుంది.



