సినీ పరిశ్రమలో కొందరు నటీమణులు కేవలం స్టార్డమ్తోనే కాదు… ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంటారు. అలాంటి అరుదైన హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులనే కాదు… పాన్ ఇండియా సినీప్రియుల మనసుల్లోనూ చెరగని ముద్ర వేసింది.
‘బాహుబలి’ సిరీస్లో దేవసేనగా ఆమె చేసిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో తాజాగానే ఉంది. ఆ పాత్రతో అనుష్క పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. భారీ విజయం తర్వాత స్వీటీ సినిమాల సంఖ్యను తగ్గించింది. కొంతకాలం స్వచ్ఛంద విరామం తీసుకున్న ఆమె… మళ్లీ తెరపై మెరవాలనే ఉద్దేశంతో ఇటీవల ‘ఘాటీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అనుష్క ఇండస్ట్రీకి, సోషల్ మీడియాకు దూరంగా సైలెంట్ మోడ్లో ఉంది.
ప్రస్తుతం ఆమె వయసు 40 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి విషయాన్ని పక్కనపెట్టి సింగిల్గానే కొనసాగుతోంది. ఈ క్రమంలో గతంలో ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తనకు ఆరో తరగతిలోనే లవ్ ప్రపోజల్ వచ్చిందని అనుష్క ఆ ఇంటర్వ్యూలో సరదాగా గుర్తుచేసుకుంది.
“నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి ‘ఐ లవ్ యూ’ అన్నాడు. ఆ వయసులో ఆ మాటకు అర్థం కూడా నాకు తెలియదు. అయినా అతను అడిగినప్పుడు అమాయకంగా ‘సరే’ అని చెప్పేశాను. ఇప్పుడు ఆ విషయం నా జీవితంలో ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది” అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.
అనుష్క ‘సూపర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా… ‘అరుంధతి’ సినిమాతో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ… అనుష్క పేరు వినగానే ప్రేక్షకుల్లో ఇప్పటికీ అదే ఆదరణ కనిపిస్తోంది.



