సోషల్ మీడియా కొందరి చేతుల్లో అభివ్యక్తి స్వేచ్ఛ కాకుండా బ్లాక్ మెయిలింగ్ ఆయుధంగా మారుతోంది. ఏదో పేరుతో యూట్యూబ్ ఛానల్ తెరవడం.. కావాల్సిన గౌరవం దక్కలేదనో, డబ్బులు ఇవ్వలేదనో.. వెంటనే కెమెరా ఆన్ చేసి “అవినీతి, అన్యాయం” అంటూ నిరాధార ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. లేనివి ఉన్నట్టు సృష్టించి ప్రజల్లో భయం, అనుమానాలు పెంచుతున్నారు. చివరికి కోట్లాది మంది భక్తితో కొలిచే దేవాలయాలు, పవిత్రమైన ప్రసాదాన్ని కూడా వివాదాల్లోకి లాగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఇటీవల భద్రాచలంలో రామయ్య లడ్డూలో పురుగు ఉందంటూ ఓ యూట్యూబర్ వీడియో వైరల్ చేయగా.. తాజాగా సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్త ఉందంటూ మరో యూట్యూబర్ దుష్ప్రచారం చేశాడు. ఈ ఘటనలు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి.
సింహాచలం ఘటనలో బయటపడిన నిజం
సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్త ఉందంటూ వైరల్ అయిన వీడియో పూర్తిగా కల్పితమని ఆలయ అధికారులు తేల్చిచెప్పారు. ప్రసాదం కౌంటర్ వద్ద సిబ్బంది తనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న కోపంతో ఆ యూట్యూబర్ ఈ కుట్రకు పాల్పడ్డాడని విచారణలో వెల్లడైంది. బయట నుంచి ఒక నత్తను తీసుకొచ్చి, తానే కొనుగోలు చేసిన ప్రసాదంలో వేసి వీడియో తీసి “ప్రసాదం అపవిత్రమైంది” అంటూ అబద్ధాలు ప్రచారం చేశాడు.
వీడియో వైరల్ కావడంతో ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడింది. వెంటనే అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. గట్టిగా నిలదీసిన తర్వాత ఆ యూట్యూబర్ తన తప్పును అంగీకరిస్తూ.. కోపంతోనే వీడియో చేశానని, ఇప్పటికే డిలీట్ చేశానని ఒప్పుకున్నాడు. ఈ వీడియో కేవలం దుష్ప్రచారమేనని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
భద్రాచలం లడ్డూ వివాదం కూడా ఇదే తరహా
భద్రాచలంలో లడ్డూ ప్రసాదంలో పురుగు ఉందంటూ ప్రచారం చేసిన వీడియో కూడా పూర్తిగా కల్పితమేనని ఆలయ అధికారులు తేల్చారు. ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కావాలని రూపొందించిన వీడియోగా పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆలయ ఈవో దామోదర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేసి, దుష్ప్రచారానికి పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
భక్తుల ఆగ్రహం
పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసేలా ప్రవర్తించడం క్షమించరాని నేరమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వీడియో డిలీట్ చేశారనే కారణంతో వదిలేస్తే, రేపు మరో ఆలయం, మరో పవిత్ర అంశంపై ఇలాంటి దాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



